మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
అగ్రిగోల్డ్ భూముల కబ్జా ఆరోపణలపై తనిఖీలు
ఆంద్రప్రదేశ్ లో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీపంట్నలోని జోగి రమేష్ ఇంట్లో 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జోగిు రమేష్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రిగోల్డ్ కు చెందిన సీఐడీ స్వాధీనంలో ఉన్న 5 కోట్ల రూపాయల విలువైన భూములను జోగి రమేష్ కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
విజయవాడ సమీపంలో ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్ కు ఆర్‌ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. జోగి రమేష్ కుటుంబం అగ్రి గోల్డ్ భూములు వివాదంలో ఉండటంతో, రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరావు, జోగి తనయుడు జోగి రాజీవ్‌లు చెరో 1,086, 1,074 గజాలను తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భూమి విషయంలో ఎక్కడా సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేశారని చెబుతున్నారు.