శత జయంతి వేడుకల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: తెలుగు, తమిళ సినిమాల్లో గయ్యాళిగా పేరుగాంచిన మహానటి సూర్యకాంతం హాలీవుడ్ లో పుట్టాల్సిందని, ఆమె నటన విశ్వరూపం ప్రపంచం మొత్తం తెలిసేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలుగింటి అత్తగా పేరుగాంచిన సూర్యకాంతం శత జయంతి వేడుకలు ఏయూలోని హిందీ భవనంలో బుధవారం ఘనంగా జరిగాయి. పద్మభూషణ్ సత్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షత జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన చలమేశ్వర్ ప్రసంగిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ తదితర నటులతో పరిచయం ఉందని, సూర్యకాంతంతో పరిచయం లేకపోవడం బాధగా ఉందన్నారు. సూర్యకాంతం తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరన్నారు.
విలన్ వేషాలు వేసిన వారిని కూడా హీరోలుగా భావించి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రాముఖ్యత కల్పించారని, కాని సూర్యకాంతానికి ఆ గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. సినిమాల్లో గయ్యాలి పాత్రలు వేసిన, నిజ జీవితంలో మంచి మనిషిగా పేరుందన్నారు. చాలామందికి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇచ్చారని, సూర్యకాంతానికి అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యకాంతం పేరు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరని, ఆమె అంతలా పాత్రలో ఇమిడిపోయారని కొనియాడారు. నటులు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ జస్టిస్ చలమేశ్వరరావుకి న్యాయ వ్యవస్థపై ఎంత పట్టు ఉందో, సాహిత్యం, కళా రంగంపై అంతే పట్టు ఉందన్నారు. సూర్యకాంతం అంటే ఇంట్లో మనిషిగా తెలుగువారు ఫీల్ అవుతారని తెలిపారు. ప్రపంచ చిత్ర రంగంలో 300సినిమాల్లో ఒకే పాత్ర చేసిన నటి సూర్యకాంతం అన్నారు. ఏ పాత్ర అయిన ఎడమ చేతితో చేస్తుంది అనడానికి ఆమె ఎడమ చేతివాటమే నిదర్శనం అన్నారు.
ఈ వైభవం నటుల్లో ఎవరికి లేదన్నారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలు కథానాయకులుగా ఉండగా గుండమ్మ కథ అని ఆమె టైటిల్ పెట్టారంటే సూర్యకాంతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుందన్నారు. మొదటిసారిగా శ్రీవాణి కళావాహిని తరఫున రవీంద్ర భారతిలో ఆమెకు సన్మాన కార్యక్రమం చేశామని గుర్తు చేసుకున్నారు. తాను మొదటిసారిగా సుమన్, తులసి హీరో హీరోయిన్ గా నటించిన కంచు కవచం చిత్రానికి మాటలు రాశానని, ఆ చిత్రంలో ఆమెతో ఒకరోజు షూటింగ్ చేశామని గుర్తు చేసుకున్నారు. సూర్యకాంతం నటియే కాదని నిత్య జీవితంలో అన్నపూర్ణ లాంటి మంచి మనిషి అని కొనియాడారు. షూటింగ్ విరామ సమయంలో వెంట తెచ్చుకున్న తినుబండారాలను యూనిట్ లోని వారందరికీ పెట్టేది అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు సూర్యకాంతం అందరి హృదయాల్లో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సూర్యకాంతం తెర మీద మెరిస్తే చాలు’ అని రాసిన కవితను చదివి వినిపించారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ సూర్యకాంతానికి ఉపాధ్యాయులు అంటే అభిమానం అన్నారు.
సూర్యకాంతం, ఆమె కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సూర్యకాంతం తనకు అమ్మలాంటిదని ఆమె జయంతి వేడుకలు ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సూర్యకాంతం మీద రాసిన చిరు కవితను చదివి వినిపించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తి మాట్లాడుతూ అమ్మ తనకు పంచిన ప్రేమ, మమకారంతో ప్రతి ఏడాది జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. శత జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా విశాఖలో జరగడం ఆనందంగా ఉందన్నారు. వైజాగ్ ఫీలిం సొసైటీ ప్రధాన కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ శతజయంతి ఉత్సవాలు ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడులో కూడ జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం జస్టిస్ చలమేశ్వర్, తనికెళ్ళ భరణి, బాల మోహన్ దాస్, అనంత పద్మనాభమూర్తి, నరవ ప్రకాశరావు, తదితరులను పద్మభూషణ్ సత్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను తనికెళ్ల భరణి సత్కరించారు. ముందుగా సూర్యకాంతం మనవరాలు సూర్య కళ, మనవడు కలిసి ఆలపించిన ప్రార్థన గీతంతో వేడుక ప్రారంభమైంది. సూర్యకాంతం నటించిన వివిధ పాత్రల 32 నిమిషాల చిత్ర వాహిని ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. సూర్యకాంతంపై ఆమె మనవరాలు సూర్య కళ రాసిన గత స్మృతుల ఛాయల కవిత్వం చదివి వినిపించారు. ఆచార్య ఎన్ బాబాయ్య వందన సమర్థంతో కార్యక్రమం ముగిసింది. ఇంకా ఈ వేడుకల్లో సినీ ప్రియులు, సూర్యకాంతం కుటుంబ సభ్యులు, అభిమానులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.