కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
కాంగ్రెస్ నినాదం, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్, బిహార్‌లో ఉన్న రాజకీయ అవసరాల కోసమే కేంద్రం కులగణనకు ఓకే చెప్పిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు కులగణన చేయబోమని కోర్టుల్లో అఫిడవిట్‌లు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే ఎక్కువ ఉందని చెప్పుకొచ్చారు. అడుగడగునా వెంటాడిన కాంగ్రెస్, ఈ నిర్ణయం మోదీ తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. దీనికి తోడు తెలంగాణ చేపట్టిన సర్వే కూడా కేంద్రానికి మోడల్‌గా మారిందని వివరించారు. దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ప్రజల గుండెచప్పుడు విన్నారని రేవంత్ అన్నారు. అందుకే కులగణన చేస్తామని హామీ ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని వెల్లడించారు. రాహుల్ సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని వివరించారు.
కేంద్రానికి రెండు తీర్మానాలు
తెలంగాణ అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని సీఎం గుర్తు చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపించిన విషయాన్ని ప్రస్తావించారు. జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టామని వెల్లడించారు. తమ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్నా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని సూచించారు. ఇందుకు కేంద్రమంత్రులతో కూడిన కమిటీతోపాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కులగణన చేపట్టే క్రమంలో తెలంగాణ విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టామని తెలిపారు. తెలంగాణలో 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించామని వివరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామని అన్నారు. ఎక్కడా పార్టీ కార్యక్రమంలా చేయలేదన్నారు.
“దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచాం”
అందరినీ భాగస్వామ్యంతో తెలంగాణలో కులగణన పూర్తి చేశామన్నారు రేవంత్ రెడ్డి. కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. కులగణనపై కేంద్రంతో తమ అనుభవాన్ని పంచుకోవడానికి ఎలాంటి భేషజాలు లేవని ప్రకటించారు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే తమ సంకల్పమని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం కులగణన చేసించూపించిందన్నారు.
“బీజేేపీ నేతలకు అదే అసూయ”
విమర్శలు చేసే బీజేపీ నేతలకు కొన్ని ప్రశ్న సంధించారు రేవంత్ రెడ్డి. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదని అడిగారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక బీజేపీ నాయకుల్లో అసూయ, అసంతృప్తి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో ఉందన్నారు. వాళ్లు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అని పునరుద్ఘాటించారు.