Wednesday, July 3, 2024

కెసిఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

  • కెసిఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
  • కేంద్ర నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది
  • టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్

కెసిఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని ఆయన విమర్శించారు. గురువారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తాము దొంగతనం చేస్తాం కానీ, మమ్మల్ని ఎవరు అడగొద్దు అనేలా బిఆర్‌ఎస్ వాదన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఏ కమిషన్ వేసినా ఆ కమిషన్‌ను ప్రశ్నించడం, ఎదురు దాడి చేయడం బిఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినట్టు విందామని ప్రతి అంశం అసెంబ్లీలోనే చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు.

అసెంబ్లీకి రమ్మంటే కెసిఆర్ రారని ఆయన విమర్శించారు. చత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై కూడా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. బిఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీని దివంగత మాజీ సిఎం రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారని అద్దంకి అన్నారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని దీనిపై కూడా బిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వల్ల నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కమిషన్‌లను తప్పుపట్టడం, విచారణ తప్పుపట్టడం బిఆర్‌ఎస్ మానుకోవాలని ఆయన సూచించారు. ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్లు భ్రమ పడొద్దని అయన అన్నారు.

జాబ్ క్యాలండర్‌ను తయారు చేస్తున్నామని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే వాళ్ల ట్రాక్‌లో నిరుద్యోగులు పడొద్దని దయాకర్ సూచించారు. సామాన్యుడు చెబితే కూడా కాంగ్రెస్ వింటుందన్నారు. ఇచ్చిన అన్ని గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని దయాకర్ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతి అంశంపైన కెసిఆర్ పేరు చర్చకు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ప్రతి పథకంలో ఆ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ప్రథమ ముద్దాయిగా ఉన్నారని అద్దంకి దయాకర్ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular