గ్రూప్–2,3లో అదనపు పోస్టులు?
త్వరలో అనుబంధ నోటిఫికేషన్
ప్రస్తుత ఖాళీలు కలుపుకొంటే పెరిగే అవకాశం
కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ
కమిషన్‌లో సిబ్బంది కోసం విజ్ఞప్తి
నేటి నుంచి గ్రూప్ –1 దరఖాస్తులు
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
టీఎస్ న్యూస్ : కొలువుల భర్తీపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొన్ని విభాగాల్లో పోస్టులను పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. గ్రూప్–2,3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రూప్–-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వ కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2022, గ్రూప్-2 నోటిఫికేషన్‌లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 2022 డిసెంబర్ 30న విడుదలైన గ్రూప్– -3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. తొలుత 1362 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నేటి నుంచి గ్రూప్–1 దరఖాస్తులు
గ్రూప్-–1 కొత్త నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-–1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత నోటిపికేషన్లు రద్దుచేస్తూ.. వాటిస్థానంలో కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. స్వల్పకాలంలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళనం చేసిన ప్రభుత్వం, ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచడం, మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, ఉద్యోగ పరీక్షల ఫలితాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫిషన్‌ను రద్దుచేసి, 60 పోస్టులు జతచేస్తూ ఇటీవల కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపోమాపో డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ను కూడా రద్దుచేసి 11 వేల పోస్టులతో డీఎస్సీ-2024 నోటిఫిషన్ వెల్లడించనున్నట్లు సమాచారం.
పోస్టులు పెంపు
రాష్ట్రంలో గ్రూప్–-2, గ్రూప్–-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 చివరలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు అదనపు పోస్టులను కలిపేందుకు నివేదిక సిద్ధం చేశారు. గ్రూప్–-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్‌కు.. మరికొన్ని కొత్త పోస్టులను జతచేయాలని కమిషన్ భావిస్తున్నది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్‌కు అనుబంధ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇందుకు ప్రభుత్వశాఖల నుంచి ఖాళీల వివరాలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ ఖాళీలపై ఆర్థికశాఖ ఆమోదం తీసుకుని గ్రూప్– -2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికోసం ఈ పోస్టుల నోటిఫికేషన్‌కు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.
ఇక, 2022 డిసెంబర్ 30న 1,363 పోస్టుల భర్తీకి గ్రూప్ -3న నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఆ తర్వాత మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. ఈ పోస్టులకు అదనపు ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్-–3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉండగా.. మరిన్ని పోస్టులను చేర్చి, అనుబంధ నోటిపికేషన్ ఇవ్వనున్నారు.
అదనపు సిబ్బందిని కోరిన టీఎస్‌పీఎస్సీ
వరుస నోటిఫికేషన్లు, పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాజా అవసరాల దృష్ట్యా 150 మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 50 మందిని తక్షణమే డిప్యూటేషన్ మీద, మరో 100 మంది ఉద్యోగులను రిక్రూట్‌చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు టీఎస్‌పీఎస్సీలో సిబ్బందిలేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదనలను పక్కనపెట్టేశారు. దీంతో ఉన్న సిబ్బందితో నెట్టుకురాలేక కమిషన్ నానా అవస్థలు పడుతోంది.
డీఎస్సీ-2023 నోటిఫికేషన్ రద్దు?
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11 వేల టీచర్ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉంది.