బిఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుకున్నట్లుగానే బిఆర్‌ఎస్ నేతలంతా వరుసకట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేరగా, గురువారం ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న ముథోల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారంలో గత కొన్ని రోజులుగా సాగుతోంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరిగినా ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం.
ఆదిలాబాద్ టికెట్ ఆత్రం సుగుణకు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో హైదరాబాద్ వెళ్లిన సుగుణ రేవంత్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా సిఎంతో పలు అంశాలపై చర్చించిన ఆత్రం సుగణకు సీతక్క పార్టీ కండువా వేసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆమె బరిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ను ఆత్రం సుగుణకు ఖరారు చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో ఆమెను ఆదిలాబాద్ ఎంపి కాంగ్రెస్ అభ్యర్థిగా సిఎం ప్రకటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు పేర్కొంటున్నారు.