Thursday, December 26, 2024

ఆదిత్య థాకరేపై మిలింద్‌ దేవ్‌రా

మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తనయుడు ఆదిత్య థాకరేపై రాజ్యసభ సభ్యుడు మిలింద్‌ దేవ్‌రాను బరిలో దించాలని సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్‌ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్‌నాథ్‌ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్‌ దేవ్‌రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏక్‌నాథ్‌ షిండే వర్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను మిలింద్‌ దేవ్‌రాకు అప్పగించారు. అక్కడ ఆయన సమర్థంగా పనిచేయడంతో వర్లి ఆదిత్య థాకరే సొంత నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేనకు కేవలం 6,500 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు వర్లీలో ఆదిత్య థాకరే, మిలింద్‌ దేవ్‌రా మధ్య మాత్రమే పోటీలేదు. అక్కడ మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన కూడా నియోజకవర్గంపై పట్టున్న సందీప్‌ దేశ్‌పాండేను బరిలో దించింది.
ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com