బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యో ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్యారానగర్ డంపింగ్ యార్డు విషయంలో స్థానికులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా.. డంపింగ్ యార్డు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీ కాదు.. పక్కా బీఆర్ఎస్ అంటూ తేల్చిచెప్పారు. అదో లౌ..ల పార్టీ అంటూ కాంగ్రెస్ పై బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే వాఖ్యలపై తీవ్ర చర్చ సాగుతోంది. అనర్హత వేటుకు భయపడే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తడంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి..
2014, 18, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు మహిపాల్ రెడ్డి. అయితే.. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ఫొటో ఉండడంపై ఇటీవల కాట వర్గం ఇటీవల ఆందోళన చేపట్టింది. మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా కూడా చేయడం సంచలనంగా మారింది. తనను చేర్చుకున్న తర్వాత.. కాట శ్రీనివాస్ ను కట్టడి చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని మహిపాల్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు చర్చ సాగుతోంది.