- 2.06 లక్షల దరఖాస్తులను పరిష్కరించేలా త్వరలో అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
మళ్లీ ధరణి పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలోనే పెండింగ్ దరఖాస్తులకు త్వరగా మోక్షం కలిగించేలా చర్యలు చేపట్టాలని రెండు, మూడు రోజుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో సమీక్ష జరుపనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ భూ సమస్యలు తగ్గడం లేదు. తాజాగా వివిధ సమస్యలకు సంబంధించి 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి ధరణి సమస్యలపై రెవెన్యూ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రి పొంగులేటి ధరణి పెండింగ్ దరఖాస్తు వివరాలతో సమీక్షకు హాజరుకావాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.
కోడ్ ముగిసిలోపు మరో 60వేల దరఖాస్తులు
ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను జూన్ 4వ తేదీలోపు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో వేగం తగ్గడంతో పాటు, లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూ శాఖ నిలిపివేసింది. దీంతో లక్ష దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయ్యింది. వీటికి పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. మరో 1.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసి కోడ్ తొలగిపోయేలోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది.
రైతులు 2023 అక్టోబర్‌కు ముందు ధరణి పోర్టల్లో చేసుకున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల కలెక్టర్లు తిరస్కరించారు.
చిన్న లోపం కనిపించినా తిరస్కరించిన కలెక్టర్‌లు
నెలనెలా దరఖాస్తుల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం విధించడంతో ఏ చిన్న లోపం కనిపించినా కలెక్టర్‌లు తిప్పి పంపించారు. పలు సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విచారణల్లో జాప్యం జరిగినా దస్త్రాలు అందుబాటులో లేకపోయినా తిరస్కరించారని రైతులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అన్ని సమస్యలపై దృష్టి పెడుతుండటంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ధరణి కమిటీ కూడా భూ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి రెవెన్యూ శాఖకు సూచనలు, సలహాలు ఇస్తోంది.
పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు సూచించింది. చాలాకాలం నుంచి భూ సమస్యలు పరిష్కారం కాక ఎదురుచూస్తున్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొ స్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ధరణి కమిటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ కానుంది. ధరణి కమిటీ చేపట్టిన అధ్యయనం, రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రూపొందించిన నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.