రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పలు కంపెనీలతో చర్చలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మేఘా, స్కైరూట్ ఏరోస్పేస్, కంట్రోల్‌ఎస్ వంటి పలు కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ పెట్టుబడుల ఒప్పందాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ సెటైర్లు వేశారు.
హైదరాబాద్ ఆధారిత కంపెనీలను దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవటమేంటని అన్నారు. రేవంత్ సర్కార్ ఇన్నోవేటివ్ ఆలోచన, పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ‘వినూత్న ఆలోచన అంటే ఏమిటి ? హైదరాబాద్ ఆధారిత కంపెనీలను స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వేల మైళ్ల దూరం ప్రయాణించి పెట్టుబడులు ప్రకటించేలా చేయడం! నిజంగా సర్కస్‌లా ఉంది. హైదరాబాద్‌లో చాయ్ తాగుతూ పూర్తి చేయాల్సిన ఒప్పందాలను.. స్విట్జర్లాండ్‌లో హాట్ చాక్లెట్‌తో పూర్తి చేయాల్సి వొచ్చింది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.