Saturday, November 16, 2024

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు అండగా ఉంటాం

  • నేతన్న భరోసా కార్యక్రమాన్ని త్వరలో అమలుచేస్తాం
  • చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నాం
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న భరోసా కార్యక్రమాన్ని త్వరలో అమలుచేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కొరకు తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే నిమిత్తం పథకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నేతన్న భరోసా అనే ప్రభుత్వ విధానాన్ని రూపొందించడానికి చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి ) ఏర్పాటు, హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్ లూమ్ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. న్యూ మైక్రో హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ ఏర్పాటుకు, స్టేట్ టెక్నికల్ టెక్స్టైల్ పాలసీ రూపొందించే ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యిందన్నారు. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నేతన్నలకు ఇచ్చిన హామీ మేరకు అండగా ఉంటామన్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ. 8.81 కోట్లు నిధులను మంజూరు చేసిందని, దీనికి తోడు మరో రూ. 7 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించిందన్నారు. గత ఏడాది నవంబర్ వరకు రూ.488.38 కోట్లు వివిధ ప్రభుత్వశాఖల నుంచి టెస్కొకు రావాల్సిన బకాయిలను నేత కార్మికులకు చెల్లించాల్సి ఉందన్నారు. 2023 బతుకమ్మ చీరల పథకం క్రింద టెస్కోకు చెల్లించాల్సిన రూ.351.52 కోట్లను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల నుంచి రూ. 53 కోట్ల విలువైన వస్త్రాలను ప్రభుతం కొనుగోలు చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. సమగ్ర శిక్షణా పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50 శాతం అడ్వాన్స్‌గా నూలు కొనుగోలు,  సైజింగ్ కొరకు సుమారుగా రూ.47 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రావాల్సిన బకాయిలు మంజూరు కొరకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు మంత్రి తుమ్మల తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular