- విద్యా రంగంలో డిజిటల్ బోధనా పద్దతులు
- రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు దోహదం
- నందన్ నీలేకనికి చెందిన ఎక్ స్టెప్-ఫౌండేషన్ తో ఒప్పందం
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పాఠశాల విద్యను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్ లను పాఠశాల విద్యాశాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యాస పద్దతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టనున్నారు. దీనిలో భాగంగా, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులున్నారు. విద్యా రంగంలో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులలో విద్యా పరమైన నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంలో ఎక్ స్టెప్- ఫౌండేషన్ అగ్రగామిగా ఉంది.
ఎక్ స్టెప్- ఫౌండేషన్ – విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయిన నందన్ నీలేకని ఈ ఎక్ స్టెప్-ఫౌండేషన్ కు కో-ఫౌండర్ గానూ ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తుంది. నేడు గురువారం బెంగళూరులో ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి తెలంగాణ విద్యాశాఖ ప్రతినిధి బృందం విద్యారంగంలో చేపట్టాల్సిన పలు చర్యలపై చర్చించింది.
ప్రాథమిక విద్యా స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో రాయడం, చదవడం, సంఖ్యాపరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం.. ఏ.ఐ ఆధారిత టూల్స్, ప్లాట్ ఫామ్ లను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలు, అభ్యాస పద్ధతులను మరింత మెరుగుపర్చడం, విద్యార్థుల్లో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి, వాటి ని సవరించడానికి తగు ఇనిషియేటివ్ లని ప్రవేశపెట్టడం.. వంటివి సూచించారు. పాఠశాల గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఉపాధ్యాయులకు డిజిటల్ పద్దతులపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం.. వంటి సూచనలను పరిగణలోకి తీసుకున్నారు.
ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను సందర్శించిన, రాష్ట్ర విద్యా శాఖ ప్రతినిధి బృందం 2024 లో కేరళ రాష్ట్రాన్నిసందర్శించి అక్కడి విద్యా రంగంలో చేపట్టిన ఆధునిక పద్ధతులను పరిశీలించింది. కేరళ ప్రభుత్వం కూడా తన రాష్ట్ర విద్యా శాఖలో ఏ.ఐ టూల్స్ లను పూర్తిస్థాయిలో వినియోగించుకొని మెరుగైన విద్యా ప్రమాణాలను సాధించిందని ఈ బృందం పరిశీలనలో గుర్తించింది. ఈ బెస్ట్ ప్రాక్టీస్ లను కూడా తెలంగాణ విద్యా శాఖలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎక్ స్టెప్ -ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏ.ఐ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టడానికి తెలంగాణ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. డిజిటల్ ఇనీటిటివ్స్, ప్రాథమిక స్థాయిలో అభ్యసన నైపుణ్యాల పెంపు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్నేహపూర్వక అభ్యసన పద్ధతుల్లో సహాయం అందించడం రంగాల్లో ఈ ప్రణాళిక ను రూపొందిస్తున్నారు.