Friday, November 15, 2024

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బిసి నేత..!

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ వైపు ఏఐసిసి మొగ్గు….?
ఏఐసిసి అగ్ర నేతలతో సిఎం రేవంత్ సమావేశం
పలు అంశాలపై చర్చ

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బిసి నేత వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలిసింది. అందరూ ఊహించిన విధంగానే పార్టీ పగ్గాలను బిసి నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహేశ్ కుమార్ గౌడ్‌కు ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి కబురు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఏఐసిసితో జరిగిన సమావేశంలో మాజీ ఎంపి మధుయాష్కీ, మహబూబాబాద్ ఎంపి బలరాంనాయక్, ఎమ్మెల్సీ, మహేశ్ కుమార్ గౌడ్‌ల పేర్లు ప్రస్తావన రాగా అందులో మెజార్టీ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఇవ్వాలని ఏఐసిసికి సూచించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ సిఎంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన భట్టి ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉండటంతో బిసి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది.

గంటపాటు ఏఐసిసి నాయకులతో సిఎం సమావేశం
ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో సిఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో నూతన పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సిఎం వారితో చర్చించారు. గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం, మంత్రి మండలిలో మార్పులు, చేర్పులపై ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీలను ఆహ్వానించారని, అలాగే రెండు లక్షల రుణ మాఫీ చేసినందుకు వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లుగా తెలిసింది. అనంతరం రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. ఏఐసిసి నుంచి పిలుపు రావడంతో గురువారం రాత్రి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై ఏఐసిసి నాయకులతో చర్చించినట్టుగా సమాచారం.

ఈ ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా
ప్రస్తుతం పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి కోసం ఏఐసిసి కసరత్తు మొదలు పెట్టింది. పిసిసి పదవి రేసులో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తో పాటు మాజీ ఎంపి మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపి బలరాంనాయక్ పేర్లు ప్రధానంగా వినిపిం చాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతాల వారీగా చూస్తే సిఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందిన వారు కాగా, పిసిసి చీఫ్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తే ఈ ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా పరిశీలించే అవకాశం ఉంది. వారిలో ఎమ్మెల్సీ, మహేశ్ కుమార్ గౌడ్ (నిజామాబాద్), బలరాం నాయక్ (ఉమ్మడి వరంగల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఉమ్మడి కరీంనగర్)లు ముందంజలో ఉన్నారు. సామాజిక వర్గాల ప్రాతిపదికన ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు సమాచారం. వీరిలో బిసిలకు ఇవ్వాలని భావిస్తే మహేశ్ కుమార్ గౌడ్‌కే పిసిసి చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పార్టీకి విధేయుడిగా మహేశ్‌కుమార్…
ఎన్‌ఎస్‌యూఐ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహేశ్ కుమార్ గౌడ్ పార్టీకి విధేయుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. దీంతో ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. లంబాడా సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న బలరాం నాయక్ కు ఇవ్వడం ద్వారా తాము గిరిజనుల పక్షమన్న సంకేతాలు ఇవ్వాలని భావిస్తే ఆయనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular