సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పీక్కు తింటున్నాడని, ఫోర్త్ సిటీలో సీఎం కుటుంబ సభ్యులు 2 వేల ఎకరాలు కొన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని, హెలీకాప్టర్లను షేర్ ఆటోల కంటే దారుణంగా కాంగ్రెస్ మంత్రులు వాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు చేసిన పర్యటనల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పాటలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తున్నాడని ఎద్దేవా చేశారు.
పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని, కేసీఆర్ గురించి ఇక మీదట అడ్డగోలుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. సీఎంను కోసుకొని తినడం కాదని ఆయనే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూడు సంవత్సరాల కింద రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ నేటికి కూడా అమలు కాలేదని గుర్తు చేశారు.