Thursday, January 30, 2025

అలకనంద టూ విశాఖ.. కిడ్నీ రాకెట్‌ లింకులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. తాజాగా రాచకొండ పోలీసులకు ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసుకు సంబంధించిన లింకు దొరికింది. విశాఖలో ఇదే కేసు వ్యవహారం బయటపడడంతో జైలుకెళ్లొచ్చిన డాక్టర్ రాజశేఖర్, పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్‌లో అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా తెలుస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చెన్నైలో రాజశేఖర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. 2023వ సంవత్సరం విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు కొందరు రూటు మార్చి హైదరాబాద్‌ కేంద్రంగా దందా చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్‌ అరెస్టుతో ఇది రూఢీ అయ్యింది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులోనూ రాజశేఖర్‌ అరెస్టై జైలుకెళ్లినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. విశాఖలో పాత కేసు నేపథ్యంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌లో దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడ్ని చెన్నైలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్‌నగర్‌ పోలీసులు, సోమవారం రిమాండ్​కు తరలించారు.

నెల్లూరు జిల్లా మిలిటరీ కాలనీకి చెందిన పెరుమాళ్ల రాజశేఖర్‌ చెన్నైలోని పెరుంబలంలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని సవిత మెడికల్‌ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2023 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్‌ అంశం తెర మీదకొచ్చింది. పెందుర్తిలోని ఓ ఆసుపత్రిలో అనధికారికంగా కిడ్నీ తొలగించారని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ దందా విషయం బయటపడింది. విశాఖకు చెందిన బాధితుడి కిడ్నీని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ ఆపరేషన్‌ను వైద్యుడు రాజశేఖర్‌ పెరుమాళ్ల చేసినట్లు గుర్తించిన పెందుర్తి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దర్యాప్తు క్రమంలో దాదాపు 10 మందికి పైగా నిందితుల్ని అరెస్టు చేశారు.

ఒక్కో ఆపరేషన్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు
రాజశేఖర్‌ హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించారు. జైలుకెళ్లొచ్చాక కొన్ని నెలల పాటు స్తబ్ధుగానే ఉన్నాడు. డబ్బుకు ఆశపడి 2024 నుంచి పవన్‌ గ్యాంగ్‌ సూచనలతో హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు అంగీకరించాడు. హైదరాబాద్‌లో చేసే ఒక్కో ఆపరేషన్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆపరేషన్లలలో ఇతడితో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో వైద్యుడు సాహిబ్‌ పాల్గొంటున్నాడు. సాహిబ్‌ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అప్పట్లో విశాఖ కేసులో పవన్‌ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులోనూ విశాఖకు చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లు కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్‌లో ఒకే ముఠా పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో అరెస్టైన నిందితుల వివరాల గురించి ఆరా తీస్తామని చెబుతున్నారు.

కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఆసుపత్రిని నిర్ణయించడం అంతా పవన్‌ గ్యాంగ్‌ చూసుకుంటుంది. తన ఫోన్‌ నెంబరు, ఆచూకీ ఎక్కడా బయటపడకుండా నిందితుడు వైద్యులకు వాట్సాప్‌ లొకేషన్‌ను పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు తేదీ, సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. ఇంత వరకూ స్పష్టత ఉన్నా, కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా సంపాదించారన్నది మాత్రం ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. కిడ్నీ సమస్యలతో వచ్చే బాధితుల డేటా ఆసుపత్రుల దగ్గర ఉంటుంది. ఇక్కడి నుంచి ఏమైనా కిడ్నీ గ్రహీతల సమాచారం సేకరిస్తున్నారా అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com