ఇళయరాజా ఈ పేరు తెలియనివారు ఉండరు. సినీ చరిత్రలోనే తనదైన ముద్ర వేశారు. తమిళ్, తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ ఇళయరాజా సంగీతంను అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా సినీ ప్రస్థానం ప్రారంభం అయ్యి 50 ఏళ్లు కావస్తోంది. గతంలో కేవలం సినిమాలు, పాటలతోనే వార్తల్లో ఉన్న ఇళయరాజా ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదం వల్ల వార్తల్లో ఉంటున్నారు. ఆయన తాజాగా తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయంలో ఉన్న అర్థ మండపం కి వెళ్లిన సమయంలో బయటకు పంపడం చర్చనీయాంశం అయ్యింది. డిసెంబర్ 16న మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా పెరుమాల్ ఆలయాన్ని సందర్శించేందుకు జనాలు పోటీ పడుతారు. ఆలయ సందర్శనలో భాగంగా ఇళయరాజా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్థ మండపంలోకి ప్రవేశించారు. ఇళయరాజా అక్కడకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న జీయర్‌లు కొందరు ఆయన్ను బయటకు పంపించారు. అక్కడ నిల్చోకూడదు అంటూ అక్కడ నుంచి వెంటనే తీసుకు వెళ్లారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారికి షాకింగ్‌గా అనిపించింది. ఇళయరాజా వంటి గొప్ప సంగీత విద్వాంసుడికి అక్కడకి వెళ్లే అర్హత లేదా, ఎందుకు ఆయనను బయటకు పంపించారు అంటూ పలువురు ప్రశ్నించారు. దేవాలయంలో ఇళయరాజాకి జరిగిన అవమానం గురించి మీడియాలో ఒక్కసారిగా కథనాలు రావడంతో దేవాలయ సిబ్బంది స్పందించారు. ఇళయరాజాకి అవమానం జరగలేదని, ఆయన్ను అవమానించడం మా ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అర్థ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ మరెవ్వరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. అదే విషయాన్ని ఆయనకు చెప్పి అక్కడ నుంచి బయటకు పంపించడం జరిగింది. ఆయన తెలియకుండా అక్కడకు వెళ్లారు తప్ప మరే ఉద్దేశ్యం లేదు అంటూ గుడి అధికారులు స్పష్టతనిచ్చారు. జీయర్‌లకు మాత్రమే ప్రవేశం ఉన్న అర్థ మండపంలోకి ఇళయరాజా తెలియకుండా వెళ్లారు. కనుక అది అపచారంగా భావించిన జీయర్లు వెంటనే ఆయన్ను బయటకు పంపించారు. అంతే తప్ప ఆయన్ను తప్పు బట్టలేదు, ఆయన తీరును విమర్శించలేదు. ఆయన సైతం విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చారు అని గుడి వర్గాల వారు ప్రకటించారు.