ఓటు హక్కు కోసం వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకోవడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలంతా తమ సొంతూళ్లకు వెళ్లడంతో రెండు రోజులుగా జన సంచారం లేక నగరం బోసిపోయింది. అయితే సోమవారంతో పోలింగ్ ముగియండంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంగళవారం తెల్లవారుజాము నుంచే 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీనగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలును మంగళవారం భారీగా ఆశ్రయించారు. దీంతో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్నీ ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తోంది. మాములు రోజుల్లో అయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు సంబంధించి భారీ క్యూలు ఉండవు. ప్రస్తుతం ఊళ్ల నుంచి ప్రజలు తిరిగి రావడంతో మెట్రోస్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.