* గ్రూప్…1 ప్రిలిమ్స్.. సయయం ఆసన్నం
* హాజరుకానున్న నాలుగు లక్షలకుపైగా విద్యార్ధులు
* రాష్ట్ర వ్యాప్తంగా 895 కేంద్రాల ఏర్పాటు
* ఉదయం 10.30 గంటలకు పరీక్ష మొదలు
* అరగంట ముందుగానే గేట్లు క్లోజ్
* ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సుల రవాణా
గ్రూప్..1 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ ) పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్ధులు హాజరువుతున్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపుగా 1.70 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 895 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒఎంఆర్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష సమయానికి గంటన్నర ముందునుంచే (ఉదయం 9 గంటల నుంచి) అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అయితే పరీక్ష ప్రారంభానికి అరగంట (ఉదయం 10 గంటల) ముందే గేట్లు మూసివేస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులలో నిర్ణీత నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.
కాగా పరీక్ష రాసే అభ్యర్ధుల సౌకర్యార్దం ఆర్టీసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు రవాణాపరంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగింది. రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ‘May I Help You’ కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు. అలాగే నగరంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచుతోంది.