నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్, ఉపాధ్యక్షుడు కృష్ణ తో పాటు జిల్లా కమిటీ సభ్యులు కలెక్టర్ ఆనంద్ తో మాట్లాడారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా అనేక మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేవని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్ కి 18 అంకణాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా కలెక్టర్ ని కోరారు.
అలానే అక్రిడియేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నాయని, చిన్న పత్రికల జర్నలిస్ట్ లకి కూడా అక్రిడియేషన్ మంజూరు విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అక్రిడియేషన్ సమస్యల్ని పరిష్కరించి ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడియేషన్ వచ్చేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడుల అంశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ని కోరారు. అలానే జిల్లాలో అందరి జర్నలిస్ట్ లకి అనుకూలంగా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటుకి స్థలం కేటాయించాలని, భవన నిర్మాణానికి సహకరించాలన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల మంజూరు కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ మధు, మురళి, సభ్యులు వెంకయ్య, సుధీర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు…