సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఉన్నపళంగా తమతో రావాలని పోలీసులు చెప్పారని, అయినప్పటికీ పోలీసులు తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బన్నీ అన్నారు. అయితే, బన్నీ కోరిక మేరకు డ్రెస్ మార్చుకునే అవకాశం ఇచ్చామని పోలీసులు రిప్లై ఇచ్చారు.
నాంపల్లి కోర్టులో హాజరు
వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు.
ఏం కేసులు పెట్టారంటే..?
నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనపై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తాను థియేటర్‌కు వస్తున్నట్లు ముందుగానే థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన బాధిత మహిళ కుటుంబానికి తాము అండగా ఉంటామని అల్లు అర్జున్ ఇంతకుముందే ప్రకటించారు. సినిమా యూనిట్ తరఫున సదరు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే.. చికిత్స కోసం అయిన ఖర్చునంతా తామే భరిస్తామని ప్రకటించారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేసే సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అల్లు అరవింద్ పోలీస్ స్టేషన్ లోపలకి వెళ్లగా శిరీష్ కారులోనే పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు.
ఈ నేఫథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.