ప్రస్తుత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంతోమంది సైనికులు బోర్డర్‌లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కొన్ని కోట్ల మంది ప్రజలను వారు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వీరికోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన ‘#సింగిల్’ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్‌లో ‘#సింగిల్’ సినిమా సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ ఈ ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉంటూ, దేశ రక్షణ కోసం పోరాడుతున్న సమయంలో తాము సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం సముచితం కాదని భావించినట్లు ఆయన తెలిపారు. కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన “#సింగిల్” ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా సమకూరిన వసూళ్లలో కొంత భాగాన్ని భారత సైన్యానికి అందిస్తామని అరవింద్ పునరుద్ఘాటించారు.