దేశ వ్యాప్తంగా సైకిళ్ళ కోసం ప్రత్యేక ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పేద ప్రజలకు తాగు నీరు, గూడు లేక బాధలు పడుతుంటే.. సైకిల్ ట్రాక్ లు కావాలా అంటూ ప్రశ్నించింది. మురికి వాడల్లో ఉండే ప్రజలకు కనీసం ఉండేందుకు ఇళ్లు లేవని, తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకట్లేదని, మీకు మాత్రం సైకిల్ ట్రాక్ లు కావాలా అని సుప్రీంకోర్టు మండిపడింది. భారతదేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ సైక్లింగ్ ప్రమోటర్ దేవిందర్ సింగ్ నాగి ఇటీవలే సుప్రీం కోర్టులో వేసిన ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ ఈ పిటిషన్ లో కోరారు. అనేక రాష్ట్రాల్లో రోడ్లపై రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రాల దగ్గర ఉన్న ప్రజలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు డబ్బులు లేవని, ప్రజలకు మంచినీళ్ళకు సరిపడా ఇవ్వలేకపోతున్నారని, దీనికోసం ప్రభుత్వాలు నానాతంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పైకిల్ ట్రాక్ లు కావాలని పగటి కలలు కంటున్నారా అంటూ న్యాయస్థానం పిటిషనర్ ను ప్రశ్నించింది. ఒకసారి దేశమంతా తిరిగి చూడాలని, మురికి వాడలను దర్శించాలని, వారికి కనీసం సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడాలని సూచించారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో…దేనికి ఇవ్వకూడదో తెలుసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది.
ట్యాంక్ బండ్‌పై ‘స్కైవాక్’
సుప్రీం కోర్టు హెచ్చరికలు ఇలా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం స్కైవాక్‌లకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే
సందర్శకుల కోసం ‘స్కైవాక్’ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీపై సంబంధిత అధికారులతో సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని తద్వారా పర్యాటకుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను గుర్తించి ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీలో పొందుపర్చాలని ఆదేశించారు.