హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం
అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు ఆయన అవిశ్రాంతంగా కృషిచేశారని వివరించారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు. ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్ రాజ్యాంగమేనని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
బాబా సాహెబ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంచేశారు. అంబేడ్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొంది, ప్రజా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేడ్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.