విదేశాంగ శాఖకు అమెరికా సమాచారం
అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను అమెరికా ముమ్మరం చేసింది. ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. వలసదారులను సంకెళ్లు వేసి తరలిస్తున్నారని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. వీటికి సంబంధించి అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్లు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తీసుకొస్తామన్నారు. సైనిక విమానాల్లో తరలిస్తోన్న ప్రక్రియపై మిస్రీ స్పందిస్తూ.. తాజా బహిష్కరణ ప్రక్రియ మునుపటి విమానాలతో పోలిస్తే భిన్నంగా ఉందన్నారు. అయినప్పటికీ.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అమెరికా ప్రభుత్వ విధానంలోనే పేర్కొన్న ఈ సందర్భంగా విషయాన్ని గుర్తు చేశారు.అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తది కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా.. 2019లో గరిష్ఠంగా 2042 మందిని తిరిగి పంపించిందన్నారు.