- అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం
- అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక
- ట్రంప్ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు
చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్ నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం.. కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి
. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు. అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు.. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు. అక్రమవలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు తరలించింది.