Thursday, April 17, 2025

హైదరాబాద్ లో ఆమ్​జెన్ రీసెర్చ్ సెంటర్

  • హైదరాబాద్ లో ఆమ్​జెన్ రీసెర్చ్ సెంటర్
  • ఈ ఏడాది చివర్లో ప్రారంభం
  • మూడు వేల మందికి ఉద్యోగాలు

అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్​జెన్​తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎక్స్క్యూటివ్ మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని అన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందన్నారు. 40 సంవత్సరాలుగా తమ కంపెనీ బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరింత సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయను నేషనల్ ఎక్జ్క్యూటివ్ గా నియమించినట్లు చెప్పారు.

పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఆమ్‌జెన్‌ ఇండియా హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను చాటిచెపుతుందన్నారు. కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆమ్ జెన్ కంపెనీ ప్రపంచంలో వంద దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు.

అడోబ్​ సిస్టమ్స్​ సీఈఓతో భేటీ

ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబ్​ సీఈవోతో సమావేశంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్ ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com