Wednesday, April 30, 2025

కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే యత్నం

కేంద్రం నివేదకను తప్పుపట్టడం దుర్మార్గం
సొంత నిర్ణయాలతో లక్షకోట్లు నీటిపాటు చేశారు
బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భారాస నేతలు సిగ్గుపడటం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. కావాలని ఎదురుదాడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇంతపెద్ద కుంభకోణం జరిగి లక్షకోట్లు నీటి పాలైతే దాని మీద వారికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ’ఎన్‌డీఎస్‌ఏ ఎవరు..? వాళ్లెవరు నివేదిక ఇవ్వడానికి’ అని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ కమీషన్లు వస్తాయని గత ప్రభుత్వ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై పవర్‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాను భారీగా పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు. రూ.80వేల కోట్లకు అనుమతులు తీసుకుంటే..ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిపోయిందని అన్నారు. వివిధ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకున్నారు. అధికశాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. భారాస హయాంలోనే ప్రాజెక్టు నిర్మించారు. వాళ్ల హయాంలోనే కూలిపోయింది. ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు.  బ్యారేజీ పూర్తయిన తొలి ఏడాదిలోనే లోపాలు బయటపడ్డాయి. లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు  చెప్పినా సరే.. పట్టించుకోకపోవడంతో నష్ట తీవ్రత పెరిగింది. మేడిగడ్డ నిర్మాణంలో లోపాలపై భారాస ఉన్నప్పుడు కూడా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బ్యారేజీ లోపలి భాగంలో నీళ్లు భూమిలోకి పోయి బ్యారేజీ వెలుపలకు వస్తున్నాయి. బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు చేయలేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీ ఉందని ఎన్‌డీఎస్‌ఏ ‌నివేదిక చెబుతోంది. నిర్మాణం మొదలుపెట్టిన 6 నెలల తర్వాత సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ ‌పంపించారు. ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చవద్దని ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో కేసీఆర్‌ ఏర్పాటు- చేసిన నిపుణుల బృందమే చెప్పింది. సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్‌లో కూడా తర్వాత ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. డీపీఆర్‌కు విరుద్ధంగా కేసీఆర్‌ ఎలా చెప్తే అలా నిర్మించేశారు. భారాస నేతల నిర్లక్ష్యం, కక్కుర్తి, అవినీతి వల్ల ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని ఉత్తమ్‌ ‌మండిపడ్డారు. వజ్రోత్సవ సభలో ఏదేదో మాట్లాడిని కెసిఆర్‌ ‌దీనిపై ఎందుకు నోరు మెదపలేదన్నారు. ఎన్‌డీఎస్‌ఏ అనేది పార్లమెంట్‌ ‌చట్టం ద్వారా ఏర్పడింది. చట్టం చేసినప్పుడు భారాస ఎంపీలు మద్దతిచ్చారు. బ్యారేజీల భద్రతపై ఎన్‌డీఎస్‌ఏ అత్యున్నత బోర్డు. దేశంలోని 700 బ్యారేజీల భద్రతను పరిశీలిస్తోంది. వివిధ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఈ బోర్డు ఏర్పాటైంది. తుమ్మడిహట్టి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్‌డీఎస్‌ఏ ‌చెప్పింది. మేడిగడ్డ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చింది. ఇవన్నీ మరచి బిఆర్‌ఎస్‌ ‌నేతలు మాట్లాడడానికి సిగ్గుండాలని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com