ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మామునూరుకు రాగా అక్కడి నుంచి ఆర్‌ఈసీకి చేరుకున్నారు. నాడు రాష్ట్ర మంత్రులుగా పొన్నాల లక్ష్మయ్య, మాదాడి నర్సింహారెడ్డి, జగన్నాయక్, పీవీ రంగారావు, వరంగల్, హనుమకొండ పార్లమెంటు సభ్యులుగా ఆర్.సురేందర్‌రెడ్డి, కమాలుద్దీన్ అహ్మద్, కేయూ పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ బండా ప్రకాశ్ బృందం మన్మోహన్‌సింగ్‌తో వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేదికపైనే ప్రపంచ ధ్వని అనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు గౌరవ డాక్టరేట్ అందించారు. తొలిసారిగా ఎంపీగా గెలిచిన తర్వాత తనకు కేంద్రసహాయ మంత్రి రావడంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పాత్ర ఎంతో ఉందని ఎంపి పోరిక బలరామ్ అన్నారు. గిరిజన సామాజిక వర్గం నుంచి ఎన్నికైన తనను మన్మోహన్‌సింగ్ ఎంతో ప్రోత్సహించేవారు. విద్య, వైద్యంతో పాటు పేదలకు ఉపయోగపడే ఏ పని కావాలన్నా తనను అడుగు ఇస్తానంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారని తెలిపారు. ఆయన మృతి చెందారనే విషయం తెలిసి తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన సహకారంతోనే తాడ్వాయి-పస్రా అటవీ రహదారి విస్తరణతోపాటు పలు అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేసుకున్నారు. భారత మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రాష్ట్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా మన్మోహన్‌సింగ్ పనిచేసిన సమయంలో తాను అనేకసార్లు కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో తాను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా బాబ్లీ ప్రాజెక్టు, నాగర్జునసాగర్ అంశంలో మన్మోహన్‌సింగ్‌ను కలిసి మాట్లాడానని చెప్పారు. మన్మోహన్‌సింగ్ మరణం తీరని లోటని పేర్కొన్నారు.