˜27న బిఆర్‌ఎస్ పార్టీ బహిరంగ భారీ సభ
˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్ రజతోత్సవ వేడకలు
˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది
˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. గతంలో 15 లక్షల మందితో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదని, ఉద్యమాల ఖిల్లా వరంగల్ లో అనేక భారీ బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించే సభకు రెండు చోట్లా స్థలాలను పరిశీలించామని చెప్పారు.
సోమవారం హన్మకొండ హరిత హోటల్ లోమాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రజితోత్సవ వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన రెండిరటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలని అన్నారు.ఈ వేడుకలు ఏడాది పాటు జరపాలని పార్టీ నిర్ణయించింది. వరంగల్‌లోనే ఈ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తన పాలనకు రెఫరండంగా తనకు వోటు వేయండని రేవంత్ రెడ్డి అడిగారని కానీ ప్రజలు చిత్తుచిత్తుగా వోడిరచారని విమర్శించారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి వోటమికి రేవంత్ రెడ్డే కారణమని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బడే భాయ్ కోసం చోటే భాయ్ తోఫా ఇచ్చాడన్నారు. తెలంగాణ గొంతుకగా బిఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు.పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బనకచర్ల నుంచి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించకపోతే ప్రశ్నించింది బిఆర్‌ఎస్ పార్టీ. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయి.
బిజెపి టిడిపితో పొత్తులో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ కి బాబును అడిగే ధైర్యం లేదు. ప్రజల పక్షాన నిజాయితీగా ధైర్యంగా నిలబడే శక్తి ఉన్న పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమేన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని పోరాడామని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకుంటే 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది బిఆర్‌ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరుగురితో మంత్రి పదవులకు రాజీనామా చేయించి కొట్లాడిన పార్టీ తమదని అన్నారు. రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా బిజెపి కోవర్టులు ఉన్నారని విమర్శించారు.
వరంగల్ తో బిఆర్‌ఎస్ కు విడదీయరాని బంధం
బీఆర్‌ఎస్ పార్టీకి, ఉద్యమానికి వరంగల్ నగరానికి విడదీయరాని అనుబంధం ఉందని హరీష్ రావు అన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన రోజు, మిలియన్ మార్చ్ జరిగిన రోజు. ఈ రోజు ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ లో భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర ఉంది. 15 లక్షల మందితో సింహగర్జనను నిర్వహించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది. వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరూ, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మేము సభ ప్రాంగణం కోసం చాలా స్థలాలు చూసాం. భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, , రోడ్డు సదుపాయం ఉన్న స్థలాలు కోసం చూశాం. మరొకసారి చూసి స్థలాలను ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నాం.
వినూత్నమైన ఆలోచనలకు, ఆందోళనలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో రూపకల్పనలు చేసి పోరాటం చేసి తెలంగాణను సాధించింది. సామాజిక, చరిత్రాత్మక అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు. ఆచార్య జయశంకర్ ఆశీస్సులతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. దిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించారు. పదేండ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. కేసీఆర్ గారు ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
రైతుబంధు పథకం జాతీయ స్థాయిలో పీఎం కిసాన్ పథకానికి ప్రేరణనిచ్చింది. అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలో అత్యంత ఎక్కువ వరి ధాన్యం పండిరచే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటు అందించారు.నీటి తీరువా రద్దు చేయడమే కాక పాత బకాయిలను కూడా రద్దుచేసి రైతులకు మేలు చేశారు. .మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికలు తీసి ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపారు. జీఎస్‌డిపి గ్రోత్ రేటులో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదు.
ఉచిత బస్సు ఒకటే ఇచ్చి మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2500 ఎగ్గొట్టారు. రైతుబంధు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది అయితే, హామీ ఇవ్వకపోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశాం. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ మాట వినాలని, కేసీఆర్ ని చూడాలని కోరుకుంటున్నారు. తెలంగాణ గొంతుకగా బిఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ప్రసవించిన బిడ్డ బిఆర్‌ఎస్ పార్టీ అని హరీష్ రావు అన్నారు..
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నా పొడవు గురించి మాట్లాడారని, పొడవుగా ఉండడం నాకు దేవుడిచ్చిన వరమని,నేను వారి లాగా విమర్శించవచ్చు.. కానీ విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా ఉన్నానని హరీష్ రావు అన్నారు. నోటికి ఏది వొస్తే అది మాట్లాడడం సబబు కాదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే నరేందర్ రెడ్డి వోటమికి కారణమయ్యాయన్నారు.రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అమ్ముడుపోయే చరిత్ర నీకు ఉంది అని,పాలన మీద దృష్టి పెట్టాలని, మొన్నటి ఎన్నికల్లో బడే బాయికి చోటే బాయ్ ఇచ్చిన గిఫ్ట్ గా హరీష్ రావు అభివర్ణించారు.