- యుతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంగా వర్సిటీ ఏర్పాటు
- హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతాం
- కొంత మంది అపోహలు సృష్టించే ప్రయత్నం
- అబద్ధాలకోరుల మాటలు తప్పని నిరూపిద్దాం
- న్యూ జెర్సీలో ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడుల వేటలో భాగంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. ఆదివారం న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం గత వారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
వాళ్లకు ఇప్పటికే బుద్ధి చెప్పామని, అబద్ధాల కోరుల మాటలు తప్పని నిరూపిద్దామని, హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలుపుదామని సీఎం పిలుపునిచ్చారు. ప్రవాసులు తమ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని, ఇకపై తెలంగాణకు సేవలు అందించాలని కోరారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్‌తో పాటు, సెవి• అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్‌తో హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నామని అన్నారు. ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ..రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ కోరిక నెరవేరిందని, ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. సాప్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్, అర్టిఫిషియల్ రంగాల్లో తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.