తెలంగాణలో పంటలు ఎండిపోయి రైతన్నలు కన్నీరు పెడుతుంటే అందాల పోటీలు అవసరమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై రంకెలు వేయడం తప్ప బడ్జెట్‍లో అంకెలు పెంచలేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ మీద కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ అందమే సక్కగా లేదని, కానీ అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతోందంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ..”రేవంత్ రెడ్డీ.. రంకెలు వేయడం కాదు బడ్జెట్ అంకెలు ఎటు పోయాయ్. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతోంది. పరిపాలన చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్. ఈ బడ్జెట్‍లో ఆరు గ్యారంటీలు గోవిందా. వాటికి పాతర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్‍లో ప్రస్తావించలేదు. తులం బంగారానికీ దిక్కు లేదు. చేనేతకు బీఆర్ఎస్ హయాంలో రూ.1,200 కోట్లు కేటాయించాం. కానీ ఇవాళ చేనేత కార్మికులను రూ.300 కోట్లు పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రసక్తే లేదు. వైన్స్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అదీ కనిపించడం లేదు. చివరికి దళిత సోదరులనూ మోసం చేశారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, కానీ నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాటా లేదు. విద్యా భరోసా గురించీ ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహానగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడలా కుప్ప కూల్చారు. ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అంటున్నారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల బడ్జెట్ కాదు.. కాంగ్రెస్ వికాస్ బడ్జెట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంట్ ఉండదు. ప్రజల సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకోం. వారికి రూ.6వేల కోట్లు పప్పు, బెల్లం మాదిరి పంచిపెట్టబోతున్నారు. తెలంగాణలో పంటలు ఎండుతుంటే.. హైదరాబాద్‌లో అందాల పోటీలు అవసరమా?” అని ప్రశ్నించారు.