సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్ సూపర్ ఫాస్ట్‌గా అదిరిపోయే ట్రాక్ లో వెళుతోంది. సినిమా ప్రాజెక్ట్స్ విషయమై ఎప్పటికప్పుడు తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్న మహేష్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒడిశాలో జరగిన భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని, తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గురించి ఒక్క చిన్న అప్‌డేట్ వచ్చినా, అభిమానుల్లో పండుగ వాతావరణమే. జక్కన్న ఎక్కడా కూడా అప్‌డేట్స్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులే కాదు, హాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కథ నేరుగా అమెజాన్ అడవుల్లో జరగే అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో మహేష్ సాహసయాత్రికుడిగా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో కీలక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరోసారి కనెక్ట్ అవుతున్నారు. బడ్జెట్ పరంగా ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ మధ్యలో విడుదలైన ఓ అడ్వర్‌టైజ్‌మెంట్ వీడియో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఓ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కోసం మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న క్యూట్ ఏమోషన్ ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ట్రెండ్స్ కు సంబంధించిన యాడ్ లో సితార తన నాన్నతో అల్లరిగా క్యూట్ గా హైలెట్ అయ్యింది. ఆయనపై క్యూట్ గా పైచేయి సాధించడం అభిమానులను ఆకట్టుకుంది. మహేష్ స్టైల్, సితార చక్కనైన లుక్స్.. చూసిన ప్రతి ఒక్కరినీ ఫిదా అయ్యేలా చేశాయి. సోషల్ మీడియాలో “తండ్రి కూతుళ్ళలాగా లేరు.. అన్నా, చెల్లెలి తరహాలో ఉన్నారు” అనే కామెంట్ల వర్షం కురుస్తోంది. సితార మాత్రం సోషల్ మీడియాలో తనేంటో నిరూపించుకుంటోంది. యూట్యూబ్‌లో డాన్స్ వీడియోలు, బ్రాండ్ షూట్లు, ఇన్‌స్టాలో రీల్స్ ద్వారా ఇప్పటికే స్టార్డమ్ తెచ్చుకుంది. ఇప్పుడు తన తండ్రితో కలిసి స్క్రీన్‌పై మెరిసిన ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఆమెకు మరో మెరుగైన గుర్తింపును తీసుకురానుంది.