పరీక్షలు వాయిదా వేయమనడం సరికాదన్న భట్టి విక్రమార్క
రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల వాయిదా సరికాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతపైనే తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. తామ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటి భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని చెప్పుకొచ్చారు. తాజా డీఎస్సీ ద్వార మొత్తం 11వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారాయన. 19,717 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, మరోవైపు 34 వేల మంది టీచర్లను బదిలీ చేశామని తెలిపారు. ఈనెల 11 నుంచి డీఎస్సీ పరీక్షకు సంబందించిన హాల్ టికెట్లు డైన్ లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచామన్న భట్టి విక్రమార్క.. కొన్ని రోజులుగా అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు.
డీఎస్సీ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తులు చేయడంతో పాటు ధర్నాలు చేస్తున్నారని..కాని అది సరైన చర్య కాదని హితువు పలికారు. గత పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదని పరోక్షంగా బీఆర్ఎస్ ను విమర్శించారు. గ్రూప్-2 ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారన్న భట్టి.. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదని చెప్పారు. 5 నుంచి 6వేల పోస్టులతో త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు భట్టి విక్రమార్క.