- రూ. 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత
- నేడు సిఎం సమక్షంలో అవగాహన ఒప్పందం
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేష్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. ఏపీలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. అమెరికా పర్యటనకు ముందు మంత్రి లోకేష్ ముంబయిలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఆ సమయంలో రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని కూడా కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.
రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, మంత్రి లోకేష్ నడుమ ఆనాడే అవగాహన కుదిరింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేష్ కృషితో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఎటువంటి హడావిడి లేకుండా చాపకింద నీరులా మంత్రి లోకేష్ చర్చలు జరుపుతున్న తీరుపై దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్ తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ తో 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేయడం, తాజాగా రిలయన్స్ పెట్టుబడులపై ఎపి పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,50,000 మంది ఉపాధి అవశాకాలు లభించనున్నాయి. ఈ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నారా లోకేష్ పక్కా ప్రణాళిక, వ్యూహ రచన చేశారు. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబుడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తోందని తెలుసుకున్న నారా లోకేష్… వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఒక మిషన్ మోడ్ లో పనిచేశారు. ముంబయిలో చర్చల తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ఏపీ ప్రభుత్వ స్పీడ్ ఆప్ డూయింగ్ బిజెనెస్ కు ఈ పెట్టుబడిలే నిదర్శనం. అనేక ప్రోత్సాహకాలతో ఎపి ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టబుడులు తీసుకువచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు.