Sunday, September 29, 2024

కేసీఆర్​కు మరో నోటీసు..?

ప్రత్యక్షంగా హాజరు కావాలని కమిషన్​ పిలుపు..?
ఈఆర్సీ అనుమతితో చేశామంటూ లేఖలో పేర్కొన్న కేసీఆర్
ఈఆర్సీ అనుమతి లేదని గుర్తించిన కమిషన్

చత్తీస్​గఢ్​విద్యుత్​ కొనుగోళ్లు, యాద్రాద్రి, భద్రాద్రి విద్యుత్​ ప్లాంట్ల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్​ను ప్రత్యక్షంగా విచారించేందుకు కమిషన్​ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష విచారణకు కేసీఆర్​ను పిలిచే అంశంపై జస్టిస్​ నర్సింహారెడ్డి కమిషన్​ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నది. విద్యుత్​ కొనుగోళ్ల అంశంపై ఇప్పటికే కేసీఆర్​.. కమిషన్​కు సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలతో పాటుగా రాజకీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. దీనిపై మంగళవారం సమీక్షించిన కమిషన్​.. త్వరలోనే కేసీఆర్​ను కమిషన్​ ఎదుట హాజరై, ప్రత్యక్షంగా వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా చత్తీస్​గఢ్​ నుంచి విద్యుత్​ కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఇవ్వకున్నా కేసీఆర్ లేఖలో ఈఆర్సీ అనుమతితోనే చేశామని పేర్కొనడం గమనార్హం. దీనిపై కమిషన్​కూడా ఆయా వర్గాల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తున్నది.

మళ్లీ సమీక్ష..!
విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో జరిగిన అవినీతిపై విచారించేందుకు ఏర్పాటైన జస్టిస్ నర్సిం హారెడ్డి కమిషన్ మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సమీక్షించింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన మాజీ సీఎం కేసీఆర్.. కమిషన్ కు విచారణార్హత లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. జస్టిస్ నర్సింహారెడ్డి బాధ్యతలను తప్పుకోవాలని కూడా సూచించారు. ఈ లేఖపై సమీక్ష మొదలుపెట్టిన కమిషన్​.. అందులో అంశాలపై సమగ్ర దర్యాప్తు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో గతంలో విద్యుత్ శాఖలో పనిచేసిన జేఏసీ నాయకుడు రఘు, టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం.. జస్టిస్ నర్సింహారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, విధివిధానాల పైనా చర్చించి, ఈ మొత్తం ఎపిసోడ్ పై రఘుపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఎక్కడెక్కడ లైన్లు ఉన్నాయి, అవసరం మేరకే కొత్త లైన్లు నిర్మించారా, అప్పటి వరకే ఉన్న లైన్ల సామర్థ్యం ఎంత, అప్పుడు విద్యుత్​ యూనిట్​ ధరలపై రఘుతో జస్టిస్ నర్సింహారెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ ఉద్యోగి రఘు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని, ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని రఘు.. కమిషన్​ ముందు స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పంపాలని ఈఆర్సీ సూచించిందని కూడా వివరించారు. ఏడేళ్లు గడిచిన గత ప్రభుత్వం సవరణలు చేయలేదని, అదేవిధంగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో జరగాల్సి ఉండేదని అభిప్రాయ పడ్డారు. అలా కాకుండా ఎంవోయూ చేసుకున్నారని వివరించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2600 కోట్ల నష్టం జరిగిందని కమిషన్​కు వివరాలు అందించారు. దీంతో కేసీఆర్​ లేఖలో ప్రస్తావించిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుకునేందుకు విద్యుత్ శాఖ ఉన్నతా ధికారులతోనూ కమిషన్ చైర్మన్ మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం రఘు, కోదండరాం నుంచి కొన్ని ఆధారాలు, వివరాలను తీసుకున్న కమిషన్​.. మరోమారు లేఖపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం మరోమారు ఈ లేఖపై సమీక్షించనున్నట్లు తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular