- నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పదివేల కోట్లు కేటాయంపు
- మెట్రో పొడగింపు తో పాటు ఫ్యూచర్ ముచ్చర్ల,వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయలకు శ్రీకారం
- మూసి ప్రక్షాళనకు ప్రణాళికలు
- భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులతో అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- క్రెడాయి స్టేట్ కాన్ సదస్సులో మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా నిర్మాణ రంగంలోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ అనే థీమ్‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర సదస్సుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.ఈ సందర్భంగా సదస్సు నుద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను ఏకంగా పది వేల కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 162 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ మెట్రో రైలు, తాగునీటి సరఫరా వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాది వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన కొనియాడారు.
కృష్ణా మరియు గోదావరి నదుల ఉభయ నదుల నుండి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత కుడా ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదే నన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో హైదరాబాద్‌కు ముచ్చెర్ల వద్ద ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరహా ప్రాజెక్టులు హైదరాబాద్ కే పరిమితము కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని, ఇవి గణనీయమైన అభివృద్ధిని సాధించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కృషితో తెలంగాణ వ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉద్ఘాటించారు.
తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డును తీసుకురావడంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని, సదస్సులో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రెడాయ్ సభ్యులు పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు.తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రెడాయ్ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. “మీ వ్యాపారం మరియు భవన నిర్మాణ కార్యకలాపాలన్నింటిలో, మా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో పట్టణీకరణ వేగవంతంగా రూపాంతరం చెందుతుందని ఇప్పటికే సుమారు 45% పట్టణ ప్రాంతాలుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణరంగాల పాత్ర అని ఆయన ప్రశంసించారు. 29 వ రాష్ట్రాంగ ఆవిర్బవించిన తెలంగాణా రాష్ట్రం త్వరితగతిన పురోగతి సాధించడం స్వాగతించాల్సిన అంశమన్నారు.
ఒక్క హైదరాబాద్ కే అభివృద్ధి ని పరిమితము చెయ్యకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పని చేయడం నుండి రాష్ట్రపతి భవన్‌లో పని చేయడం వరకు తన విభిన్న అనుభవాల గురించి మాట్లాడాతూ తెలంగాణ ప్రపంచస్థాయికి ఎదగడానికి ఎంతో సమయం పట్టదని ఆయన చెప్పారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణాకు వృద్ధి రేటులో ప్రపంచ వ్యాప్త గుర్తింపు లనిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ స్థాయిని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక వినూత్న చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని అందరికి అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతున్నదన్నారు.రాష్ట్రఅభివృద్ధికి అవరోధంగా ఉన్న అడ్డంకులు, తొలగించేందుకు సమిష్టి గా పనిచేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రోత్ కారిడార్, పెరి అర్బన్ జోన్లలో బిల్డింగ్ కవరేజీ పరిమితులు, వ్యవసాయ లేఅవుట్‌లు మరియు జిహెచ్‌ఎంసితో సహా రాష్ట్రవ్యాప్తంగా జోనింగ్ నిబంధనలకు సంబంధించిన సమస్యలు న్యాయబద్ధమైనవని, వాటిని ఈ సమావేశంలో తీసుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ఎనిమిది నెలల్లోనే తెలంగాణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పెను సవాల్ గా మారిన నిరుద్యోగ సమస్యను సమిసి పోయేలా చేసేందుకు అనేక మార్గాలలో చర్యలు చెప్పట్టామన్నారు. అయితే నైపుణ్యం కలిగిన యువత కోసం నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగిందన్నారు. తద్వారా ఈ సమస్య కు మార్గం సుగమం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్టాంప్ డ్యూటీని తగ్గించడం మరియు మాస్టర్ ప్లాన్‌ను సవరించడం వంటి అంశాలను అధ్యయనం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వీలుగా వ్రాతపూర్వక విజ్ఞాపనలను సమర్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మాణ రంగ పరిశ్రమ ప్రతినిధులను కోరారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధి చెందుతున్న నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఏది అవసరమో అది మా ప్రభుత్వం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణకు అనుకూలమైన వాతావరణం, కాస్మోపాలిటన్ సంస్కృతి మరియు అధిక యువత జనాభాను హైలైట్ చేసిన ఆయన, వ్యాపార వృద్ధికి తోడ్పడటానికి ప్రభుత్వం పరిపూర్ణ శాంతిభద్రతలను, పారదర్శక పాలనతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ మారుతుందని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్, ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.