Tuesday, November 19, 2024

కృష్ణానదీలో జలదోపిడికి మరొ కొత్త ప్రాజెక్టు !

తుంగభద్ర నదిపై మరో రిజర్వాయర్
తెలంగాణను విస్మరించిన ఏపి కర్ణాటక
అ రెండు రాష్ట్రాలకే ప్రయోజనం !
రాష్ట్ర ప్రాజెక్టులపై పెను ప్రభావం
తాగునీటికి కటకటలాడాల్సిందే

కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపై మరో నీటిపారుదల ప్రాజెక్టుకు పునాదులు పడబోతున్నాయి. అంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల మద్యన ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి పంచముఖి వెళ్లే మార్గంపై రాకపోకలు సాగేందుకు వీలుగా కూడా ఈ ప్రాజెక్టును ఉపయోగించనున్నారు. బ్రిడ్జికం రిజర్వాయర్‌గా ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు డిపిఆర్ సిద్దం చేయాలని నిర్ణయించారు. కృష్నానది బేసిన్ పరిధిలో మహారాష్ర , కర్ణాటక , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కృష్ణానదీజలాలను ఉపయోగించుకోవాలంటే బేసిన్ పరిధిలో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాల భాగస్వామ్యంతోనే నిర్ణయాలు జరగాల్సివుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కృష్ణానదీ జలాలకు సబంధించిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటివాటాలపై ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల మద్య నీటి వినియోగంపై సమన్వయం నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డును నియమించింది.

 

కృష్ణా నది పరివాహకంగా ఉన్న ప్రాంతంలో తుంగభద్ర నదిపై ఏ కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న తొలుత కృష్ణాబోర్డులో ప్రతిపాదించాల్సివుంది . తెలంగాణ , ఏపి ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం ద్వారానే ఏ ప్రాజెక్టుకైనా అనుమతి పొందాల్సివుంది . అంతే కాకుండా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన తెలంగాణ , ఆంధప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సివుంది. . అయితే ఇవేవి లేకుండానే తెలంగాణ రాష్ట్రంతో నామమాత్రంగానైనా చర్చించకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి.

 

బ్రిడ్జికం బ్యారేజి నిర్మాణంతో తుంగభద్ర నదిలో జలదోపిడికి సిద్దమవుతున్నాయి. కర్ణాటక రాఫ్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి బోసరాజు, రాయచూర్ ఎంపి కుమార్ నాయక్ ,కర్నూలు జిల్లా ఎంపి పంచలింగాల నాగరాజుతోపాటు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల మధ్య మంత్రాలయంలో చర్చలు జరిగాయి. తుంగభధ్ర నదీజాలను రెండు రాష్ట్రాల్లోని కర్నూలు , రాయచూర్ జిల్లాల్లో ఉపయోగించుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. నదిలో బ్రిడ్జికం రిజర్వాయర్ నిర్మించటం ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, రెండు రా్రష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాలకు సాగనీటిని అందించే వీలుంది తదితర వివరాలపై సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభావం:
తుంగభద్ర నదిపై మంత్రాలయం వద్ద బ్రిడ్జికం బ్యారేజి నిర్మాణం వల్ల ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై పడనుంది. కృష్ణాపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజ్టెలకు కృష్ణానది తర్వాత దాదాపు తుంగభద్ర నదినుంచే అధికంగా నీటి లభ్యత ఉంటుంది. కృష్ణానది బేసిన్ పరిధిలో తెలంగాణ , ఆధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811టిఎంసీల నీటి కేటాయింపుల్లో ఏటా 250టిఎంసీలనుంచి 350టిఎసీల వరకూ తుంగభధ్ర నదిద్వారానే నీటి లభ్యత ఉంటోంది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం , తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం , పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పధకం , శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం , నాగార్జున సాగర్ ఎడమ కాలువ తదితర వాటి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సివుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు కేటాయింపుల మేరకు నికర జలాలు కూడా అందటం లేదు. గత ఏడాది సాగునీటి పారుదల మాట అటుంచి తాగునీటి అవసరాలకు సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్ణాటక ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఎగువన ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాలు తుంగభద్ర పై మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రభావం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైనే కాకుండా తాగునీటికోసం అన్ని వర్గాల ప్రజలపైన పడనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular