- సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు
- సలహా కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
సమగ్ర కుటుంబ ఆర్థిక , రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్య యనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సలహా కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య వైస్‌చైర్మన్ గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్ గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖదేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, శాంత సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, ప్రొఫెసర్ భూక్య భంగ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ డ్రీజ్ ఉంటారని తెలిపారు.
ఈ నిపుణుల కమిటీ సర్వే నివేదికను నెల రోజుల్లో ప్రణాళిక శాఖకు అందజేయాలని తెలిపారు. ఈ సామాజిక ఆర్థిక సర్వేను దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నతభావంతో మార్గదర్శనం చేశారని తెలిపారు. సమాజంలో సామాజిక న్యాయానికి పునాది వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సర్వే జరిపించిందని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వొద్దనే ఆలోచనతో లోతుగా అధ్యయనం చేసి భాగస్వాములు అందరితోనూ సర్వేపై ముందస్తుగా సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్ గా ఏర్పాటు చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే జరిపించినట్లు తెలిపారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా, అపోహలకు తావు లేకుండా ఉండేందుకు దేశంలో, రాష్ట్రంలో సామాజిక స్పృహ కలిగిన మేధావులను సమగ్ర కుటుంబ సర్వే అధ్యయనంలో భాగస్వాములను చేసి స్వతంత్ర హోదా కల్పించినట్టు తెలిపారు. సమావేశంలో ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.