మజాకా టీజర్ లాంచ్ కార్యక్రమం కాస్త మజాకాగానే జరిగినట్లు ఉంది. అదేంటి అనుకుంటున్నారా ఆ టీజర్ లాంచ్ పలు వివాదాలకు ఫోకస్ గా మారింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్షు శరీరాకృతి గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ప్రేక్షకులు, నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, తాజాగా నటి అన్షు స్పందించి అన్ని అభ్యంతరాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన అన్షు, త్రినాథరావు నక్కిన గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. ‘‘త్రినాథరావు నన్ను కుటుంబ సభ్యురాలిగా భావించారు. టాలీవుడ్‌లో నా రెండవ ఇన్నింగ్స్‌కి ఆయన వంటి దర్శకుడు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అంటూ అన్షు తన మాటల్లో దర్శకుడిపై ఉన్న గౌరవాన్ని తెలియజేశారు. ఈ వ్యాఖ్యలతో త్రినాథరావుపై ఉన్న వివాదానికి ఆమె తన శైలిలో ముగింపు పలకాలని యత్నించారు. అన్షు ఇలాంటి సందర్భంలో ఎంతో ఓర్పుతో వ్యవహరించడం అభిమానులకు కూడా ఆకట్టుకుంది. ఈ వివాదంపై నటి ఈ విధంగా స్పందించడం చాలా మందికి హర్షం కలిగించింది. మజాకా టీజర్‌పై తాను ఎంతో ఆశలు పెట్టుకున్నానని, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు సినిమా విజయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు తాను అనవసరంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం ఎక్కువ చర్చకు దారితీసింది. అయితే, అన్షు తన అభిప్రాయంతో ఈ వివాదాన్ని ముగించేందుకు ప్రయత్నించడాన్ని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మజాకా చిత్రంలో అన్షు కీలక పాత్ర పోషిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, రీతూ వర్మ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ తర్వాత వచ్చిన ఈ వివాదం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.