Monday, September 30, 2024

ప్రజా రాజధానిని విధ్వంసం చేశారు

  • అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు
  • ఒక వ్యక్తి మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం
  • 80 శాతం పూర్తి అయిన నిర్మాణాలను అలాగే వదిలేశారు
  • రాజధాని పనులపై వైట్ పేపర్ విడుదల చేస్తా
  • ఎపి సీఎం నారా చంద్రబాబు నాయుడు

నాలుగు గంటల పాటు అమరావతిలో సీఎం పర్యటన..రాజధాని భవనాల పరిశీలన
రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని… గత పాలకుల మూర్ఖత్వం వల్ల రెండూ విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని అపహాస్యం చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి రాజధానిలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన, విధ్వాంసాలకు గురైన నిర్మాణాలు, శిథిలాలను పరిశీలించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాలను మొదట పరిశీలించారు.

 

అక్కడి నుండి బయలుదేరి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నాడు రాజధానికి భూమిపూజ జరిగిన వేదిక వద్ద మోకాళ్లపై ప్రణమిళ్లారు. అక్కడ నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహాలను పరిశీలించారు. తరువాత ఆలిండియా సర్వీసెస్ న్యామూర్తుల కోసం నిర్మించిన భవన సముదాయాలు పరిశీలించారు. అనంతరం మంత్రుల నివాస గృహాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల, నాలుగవ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లను పరిశీలించారు. ప్రతి నిర్మాణం లోపలికి వెళ్లి ఆయా ఫ్లాట్స్ విస్తీర్ణం, ప్లాన్ లో ఉన్న సౌకర్యాలు, డిజైన్ల గురించి అధికారులతో మాట్లాడారు.

 

అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డులో ఉన్న సిఆర్ డిఎ భవనం వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక సవాళ్లను, కేసులను అధిగమించి 1,631 రోజులు ఆందోళనలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారడంతో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో రైతులు ఆందోళనలు విరమించారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం…భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీ అనే పదంలో ఏ అంటే అమరావతి…పీ అంటే పోలవరం. అమరావతి ప్రజారాజధాని. తెలుగువారికి చిరునామాగా ఉంటుంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.

త్వరలో శ్వేతపత్రం విడుదల
రాజధానిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పైగా ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వకుపోయారు. ఒక్క బిల్డింగును కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. కొన్ని బిల్డింగ్ లు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఐఎఎస్, ఐపిఎస్, జడ్జీల భవనాలు, మంత్రులు భవనాలు, గెజిటెడ్ అధికారుల, నాన్ గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణం ప్రారంభించాం. ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిపేశారు. శ్వేతపత్రం విడుదల చేసి రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు వివరాలన్నీ తెలుపుతాం. ప్రజల్లో కూడా గత ప్రభుత్వం విధ్వంసంపై చర్చ జరగాలి. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.

తెలుగుజాతి గర్వంగా, గౌరవంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై ఇష్టారీతిన బురదజల్లారు. నిత్యం విష ప్రచారం చేశారు. బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు..స్విస్ ఛాలెంజ్ లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధాని పెట్టండని శివరామకృష్ణకమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే 12 పార్లమెంట్ స్థానాలు ఒకవైపు, మరో 12 పార్లమెంట్ స్థానాలు ఇంకోవైపు ఉండేలా చూసి గుంటూరు సెంట్రల్ గా అమరావతిని రాజధానిగా గుర్తించామని సీఎం చంద్రబాబు వివరించారు.

మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట
‘మూడు రాజధానుల అని మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు.. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజధాని నుండి సంపద తోనే అమలు చేయవచ్చు…కానీ గత పాలకులు నిర్వీర్యం చేశారు.వైసీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఎలాంటి వారికి ఓటు వేశారో ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకనే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం.

రౌడీయిజాన్ని అణచివేస్తాం. రాజధానిలో జరిగిన నిర్మాణాలను ఉన్మాదిబారి నుండి దేవుడే కాపాడారు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత ఉందా అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలీదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలీదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాష్ట్రానికి పూర్వవైభం తీసుకొస్తాం. పునర్నిర్మిస్తాం. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారలు ప్రవర్తన మార్చుకోవాలి. అందరి సహకారం, భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics