Monday, September 30, 2024

మా ఐఏఎస్‌లను మాకు పంపండి..!

  • డిఓపిటికి లేఖ రాసిన ఎపి ప్రభుత్వం
  • త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణలో పనిచేస్తున్న 8 మంది అధికారులు
  • ఇబ్బందుల్లో తెలంగాణ ప్రభుత్వం
  • ఇప్పటికే రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత

మా ఐఏఎస్‌లను మాకు పంపాలని- డిఓపిటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. అందులో భాగంగా -రెండు రోజుల క్రితం తెలంగాణకు ఈ విషయమై డిఓపిటి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే -తెలంగాణలో పనిచేస్తోన్న 8 మంది ఎపి కేడర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు -త్వరలో ఢిల్లీకి వెళ్లి డిఓపిటిలో రిపోర్ట్ చేయనున్నట్టుగా తెలిసింది. తెలంగాణలో తగినంత మంది ఐఏఎస్‌లు లేక ఇబ్బందులు పడుతుండగా ఉన్నవాళ్లలో కొంతమంది ఐఏఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు, కీలక శాఖల బాధ్యతలను నిర్వహించిన సామర్థం లేకపోవడం, ఉన్న వారిని అక్కడిక పంపిస్తే పాలనలో ఇబ్బందులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎపి ప్రభుత్వం డిఓపిటికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఐఏఎస్‌లకు కీలకశాఖలపై పట్టులేదు. పట్టు ఉండి, పని తెలిసిన మరికొందరు అధికారులను తమకు ఇచ్చేయాలని ఎపి విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో ఎపిలో పని చేస్తోన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎపి ప్రభుత్వం డిఓపిటికి రాసిన లేఖలో పేర్కొంది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఎపి కేడర్ అధికారులను అక్కడికి పంపాలని డిఓపిటి రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని ప్రస్తుతం కీలకంగా మారింది.

ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులపై కోర్టుకు ఐఏఎస్‌లు
రాష్ట్ర విభజన తరవాత తెలంగాణ, ఎపిల మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన కోసం కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కింద జనాభా నిష్పత్తి ప్రకారం 58:42 ధామాషాలో రెండు రాష్ట్రాల మధ్య బ్యూరోక్రాట్ల పంపకాలు జరిగాయి. 2014 లో ఏర్పాటైన ఈ కమిటీ 2015 జనవరి కల్లా నివేదికను కేంద్ర హోంశాఖకు అందించింది. అక్కడి నుంచి అందిన ఆదేశాలతో మార్చిలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలు వాళ్ల కేడర్ అధికారులను నోటిఫై చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చుకున్నాయి.

అయితే, కొందరు అధికారుల ఆప్షన్లకు భిన్నంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ వారి కేడర్‌ను కేటాయింపులు చేసింది. ఈ మేరకు డిఓపిటికి సైతం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ అప్పట్లోనే ఆ అధికారులు కోర్టు గడప తొక్కారు. ఇరుపక్షాల వాదోపవాదాలు సుదీర్ఘంగా విన్న తరవాత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోర్టు తీర్పు అమల్లో జాప్యం జరిగింది.

తెలంగాణ ఐఏఎస్‌ల క్యాడర్ స్ట్రెంత్ 218
తెలంగాణ ఐఏఎస్‌ల క్యాడర్ స్ట్రెంత్ 218 కాగా, 170 మంది అధికారులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తోన్న వారిలో వాకాటి కరుణ, (ఐఏఎస్, బ్యాచ్ 2004), రోనాల్ రాస్, (ఐఏఎస్, 2006), వాణీ ప్రసాద్, (ఐఏఎస్, 1995), ఆమ్రపాలి కాట, (ఐఏఎస్, 2010), ప్రశాంతి, (ఐఏఎస్ 2009) లు పోగా మిగిలేది 165 మంది మాత్రమే. అటు, ఐపిఎస్ కేడర్ స్ట్రెంత్ 139 కాగా, ఎపి క్యాడర్ నుంచి మాజీ డిజిపి అంజన్ కుమార్, (ఐపిఎస్, 1990), అభిలాష బిస్త్, [ఐపిఎస్, 1994], అభిషేక్ మహంతి, (ఐపిఎస్, 2011)లు తెలంగాణలో పని చేస్తున్నారు.

వీళ్లు కూడా ఎపికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ స్ట్రెంత్ 210 మంది కాగా, అక్కడి నుంచి చెరువు హరిచరణ్, (ఐఏఎస్), శ్రీజన గుమ్మళ్ల, (ఐఏఎస్), శివశంకర్, (ఐఏఎస్)లు తెలంగాణకు వెనక్కి రావాల్సి ఉంటుంది. మరోవైపు 1988 బ్యాచ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొదలు తెలంగాణకు కేటాయించబడిన తరువాత ఎపికి ఆప్షన్ పెట్టుకుని వెళ్లిపోయింది. ఆమె ప్రస్తుతం అక్కడ అబ్జార్బ్ అయింది. మరో అధికారి ఎస్‌ఎస్ రావత్ ముందుగా ఎపికి అలాట్ అయినా, న్యాయస్థానం తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన తెలంగాణకు తిరిగి రావాల్సి ఉంది.

ఈనెల 25 వ తేదీన ఢిల్లీలోని డిఓపిటి వద్దకు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి, ప్రస్తుతం ఎపిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు అక్కడి ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల్లో కొందరు నేరుగా వైఎస్ జగన్‌తో సంబంధాలు పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన టీంను కొత్త అధికారులతో కూర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది.

అందులో భాగంగానే ఆయన డిఓపిటికి లెటర్ రాయడం, అందుకు సానుకూల స్పందన రావడం, ఆ వెంటనే అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం డిఓపిటి సమాచారం అందించినట్టుగా తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈనెల 25 వ తేదీన ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) అధికారులతో సమావేశమై, క్యాడర్ వివాదంలో డిఓపిటికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular