మరో 409 కోట్లు.. రూ.1,38,117 కోట్లకు చేరిన రేవంత్ సర్కార్ అప్పు
అప్పులు చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.409 కోట్ల అప్పు తీసుకున్నది. రూ.409 కోట్ల విలువైన బాండును 26 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి జారీచేసి ఈ రుణం పొందింది. డిసెంబర్ నెలలో ఇప్పటికే రెండు దఫాలుగా రూ.3,500 కోట్లు (3న రూ.2,000 కోట్లు, 17న రూ.1,500 కోట్ల) రుణం సమీకరించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన 389 రోజుల్లో తెలంగాణ ప్రజలపై అక్షరాల రూ.1,38,117 కోట్ల రుణభారం మోపింది. కాంగ్రెస్ ప్రభుత్వం సగటున గంటకు రూ.14 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఒక్క రిజర్వు బ్యాంకు నుంచే కేంద్రం అనుమతి ఇచ్చిన పరిధిలో (ఎఫ్‌ఆర్బీఎం) రూ.56,027 కోట్ల రుణం తీసుకున్నది.
ఇతర మార్గాల్లో కూడా రుణ సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచే కాకుండా ఇతర మార్గాల్లోనూ అప్పు తీసుకొస్తున్నది. చివరికి ప్రభుత్వ భూములను సైతం తనఖా పెట్టి రుణాలు సేకరిస్తున్నది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారెంటీగా రూ.61,991 కోట్లు సేకరించింది. ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకుండా కూడా మరో రూ.10,099 కోట్ల రుణం పొందింది. తాజాగా ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూములను ఎకరాకు రూ.75 కోట్ల మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కు అప్పగించింది. టీజీఐఐసీ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది.
డిసెంబర్‌లో ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలు
డిసెంబర్ 3న రూ.2,000 కోట్లు
డిసెంబర్ 17న రూ.1,500 కోట్లు
డిసెంబర్ 31న రూ.409 కోట్లు
రేవంత్ సర్కారుచేసిన అప్పుల పద్దులు
2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఆర్బీఐ నుంచి డ్రాచేసిన ఎఫ్‌ఆర్బీఎం రుణాలు: రూ.56,027 కోట్లు
కార్పొరేషన్లు/ఎస్‌పీవీలు తీసుకున్న ఎఫ్‌ఆర్‌బీఎంయేతర రుణాలు రూ.61,991 కోట్లు
గ్యారెంటీ ఇవ్వకుండా పొందిన రుణాలు: రూ.10,099 కోట్లు
400 ఎకరాలు కుదవబెట్టి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఐసీఐసీఐ నుంచి టీజీ ఐఐసీ ద్వారా తీసుకున్న రుణం: రూ.10 వేల కోట్లు