* వాస్తు కోసం..!
* సచివాలయంలో మార్పులు
* సీఎం కాన్వాయ్ ఎంట్రీ ద్వారం మార్పు
* గతంలోనూ వాస్తు మార్పులు చేసిన మాజీ సీఎం కేసీఆర్
నూతనంగా.. అత్యాధునిక సౌకర్యాలు, అన్ని రకాల వాస్తులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయంలో మళ్లీ వాస్తు కోసంమార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు. ఇకపై సచివాలయం వెస్ట్ గేట్ (పశ్చిమ) నుంచి కాన్వాయ్‌కు ఎంట్రీ ఉండనుంది. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటికి వెళ్లనున్నది. సీఎం వెళ్లే గేట్లకు తాళం వేశారు. అయితే.. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు మాత్రం సౌత్, ఈస్ట్ గేటు రాకపోకలు సాగించనున్నట్లు చెబుతున్నారు. తాజాగా సచివాలయంలో మార్పులు, చేర్పులకు దిగడంతో.. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా మార్పులు చేయాల్సిన అవసరమేంటి..? అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక రేవంత్‌రెడ్డి.. వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లలో మార్పులు చేయడం కొంత వివాదంగానే మారుతున్నది. అంతేకాకుండా ప్రస్తుతం ఆరో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయాన్ని తొమ్మిదో ఫ్లోర్‌కు మార్చేందుకు కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొమ్మిదో ఫ్లోర్లో సీఎం చాంబర్ కోసం పనులు జరుగుతున్నాయి.
నాడు కేసీఆర్.. నేడు రేవంత్!
ఇప్పటికే తెలంగాణ గీతం, చిహ్నం.. తెలంగాణ తల్లి, టీఎస్ నుంచి టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. వివాదాల నడమే గీతాన్ని.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేశారు. అయితే.. రాజముద్ర (చిహ్నం) మార్పుపై పెద్ద రాద్ధాంతమే నడుస్తుండగా ప్రజాభిప్రాయానికి వెళ్లాలని రేవంత్ నిర్ణయించారు. సీఎం చేస్తున్న ఈ మార్పులతో బీఆర్ఎస్ హయాంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన మార్పులను మళ్లీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు, చేర్పులు మామూలే అన్నట్లుగా జనాలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కూడా తెలంగాణ భవన్‌కు కేసీఆర్ మార్పులు చేసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో వాస్తు మార్పులు తప్పేలా లేవు.