బట్టలు విప్పుడు.. కత్తులు దూసుడే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలు.. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యత్యాసాలను చెప్పుకొచ్చారు. గతంలో అసెంబ్లీని ప్రజలు ఆసక్తిగా చూసేవారని అన్నారు. ఇప్పుడు మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే అన్నట్లుగా సమావేశాల్లో కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, వివేక్ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. వివేక్‌ను మంత్రిగారు అంటూ మల్లారెడ్డి పలుకరించడంతో ఆసక్తిగా మారింది.
పార్లమెంట్‌లో ఆనాడు మాజీ ప్రధాని వాజుపేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు అత్తుకుని పోయేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో మాత్రం బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోందంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సంచలనంగా మారాయి.
మల్లారెడ్డి, వివేక్ మధ్య ఆసక్తికర సంభాషణ
ఇక.. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈరోజు అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘వివేక్‌ను.. నమస్తే మంత్రి గారు’ అంటూ మల్లారెడ్డి పలకరించారు. ఇందుకు థాంక్స్ మల్లన్న అని పలకరించారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీదే హవా నడుస్తోందంటూ మల్లారెడ్డి కామెంట్స్ చేయగా.. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచిందని వివేక్ సమాధానం ఇచ్చారు. ‘మేము అధికారం కోల్పోయాం మాదేం లేదన్న’ అంటూ మల్లారెడ్డి అనడంతో ఇద్దరు నేతల మధ్య నవ్వులు పూశాయి.