అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేనట్లుగా బీసీ కులగణన నిర్వహించి, బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం అని అన్నారు. బీసీ బిల్లుపై అన్ని పక్షాలు ఏకథాటిగా ముక్తకంఠంతో మద్ధతు ఇవ్వాలని, కేంద్రం కూడా ఈ ఐక్యతను చూసి దిగివస్తుందని, తమిళనాడు స్పూర్తితో రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ అంశంలో పిల్లి శాపనార్థాలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడవద్దని, నిండు నూరేళ్లుండాలే.. పెండ్లి పెటాకులు కావాలే అన్నట్లు మాట్లాడొద్దని విపక్షాలకు సూచించారు. దేశానికి రోల్ మోడల్ కాబోతున్న బిల్లుపై తమిళనాడు స్పూర్తితో ఏకపక్షంగా పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామని, అందుకోసం అన్ని పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కాగా, తెలంగాణ శాసనసభలో కీలక బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ చట్ట సభలో ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్టసవరణ బిల్లును ఆ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. వీటితో పాటు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.