-
నాగ చైతన్య- శోభితల జాతకం ఎందుకు చెప్పానంటే?
-
మరో వీడియో విడుదల చేసిన జ్యోతిష్యుడు వేణు స్వామి
సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పి పప్పులో కాలేసిన వేణు స్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం ప్రకటన చేశాడు. కానీ ఇంతలోనే మాట తప్పిన వేణు స్వామి మళ్లీ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంపై జ్యోతిష్యం చెప్పాడు. గతంలో నాగ చైతన్య, సమంతల పెళ్లి గురించి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడో.. ఇప్పుడు నాగ చైతన్య శోభితలపై సైతం అలాంటి కామెంట్సే చేశాడు. దీంతో అక్కినేని అభిమానులు వేణు స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సినీ జర్నలిస్టు సంఘాలు సైతం వేణు స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు మహిళా కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు ఫిల్మ్ జర్నలిస్టులు. ఏ క్షణంలోనైనా వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై వేణు స్వామి స్పందించాడు. తనపై నమోదైన కేసులపై ఇప్పుడు తానేమి మాట్లాడనని చెప్పిన వేణు స్వామి.. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలని చెప్పాడు. తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలని.. కేసులు గట్రా అంటే హీరోయిన్లను, మా అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్య కాలంలో ఒక రాజకీయనేత బండ బూతులు తిట్టాడని గుర్తు చేశాడు.
అంతే కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఎలా ఆడుకున్నారో అన్నీ చూశామని చెప్పిన వేణు స్వామి.. తాను జాతకాలు చెబితేనే అరెస్టులు అంటే ఎలా అని ప్రశ్నించాడు. తనపై ఎవరు కేసులు పెట్టారో తెలియదని.. ఎవరో ఫోన్ చేసి గురువు గారు మీరు అరెస్ట్ అయ్యారంట అని అడిగితే లేదు నాయనా నేను నా ఆఫీసులోనే ఉన్నాను.. ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పానని చెప్పారు వేణు స్వామి. నాగ చైతన్య శోభిత ధీళిపాళ్ల లపై కామెంట్స్ వ్యవహారంలో వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమీషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
అంతకు ముందు నాగ చైతన్య, శోభిత ధీళిపాళ్ల జాతకం ఎందుకు చెప్పానో వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను ఇంతకు ముందు సమంత, నాగచైతన్య ల జాతకాన్ని చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగానే నాగచైతన్య, శోభితల జాతకాన్ని చెప్పానని అన్నాడు. అంతే తప్పా ఇంకేమీ లేదని.. రెండు నెలల క్రితం తాను చెప్పినట్లుగా సెలబ్రిటీల జాతకాలు చెప్పనని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఇకపై రాజకీయ విశ్లేషణలు సైతం చేయనని చెప్పిన వేణు స్వామి.. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నానని అన్నాడు. వేణు స్వామిపై నమోదైన కేసులపై ఆయన భార్య శ్రీవాణి ఘాటుగా స్పందించింది. మరీ ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ పై తీవ్ర స్థాయిలో మండి పడింది.