Wednesday, March 26, 2025

మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

ఎంఎంటీఎస్‌ రైలు ఘటన దారుణం
బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి
గాంధీ దవాఖానలో బాధితురాలికి పరామర్శ
మెరుగైన చికిత్స కోసం యశోదా హస్పిటల్‌ కు తరలింపు

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైల్లో ఓ యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు శిల్పారెడ్డి గాంధీ దవాఖానకు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదేశాలతో..
విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి బాధితురాలికి అండగా నిలవాలని బిజెపి మహిళా మోర్చాకు ఆదేశించారు. అదేవిధంగా బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి గాంధీ దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై, ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. అయితే, సరైన వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

దవాఖానలో వివిధ పార్టీల నాయకులు కేవలం పరామర్శలకే పరిమితయ్యారని, కాని బాధిత యువతికి న్యాయం చేసేందుకు ముందుకురావడం లేదని బాధను వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన బండి సంజయ్‌ కుమార్‌ బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం చర్యలు తీసుకున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా బిజెపి అండగా ఉంటుందని తెలిపారు. ఇదే విషయమై బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డితో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా యశోద హాస్పిటల్‌ కు తరలించాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలిని సికింద్రాబాద్‌ యశోదలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.

దయనీయ స్థితిలో మహిళా భద్రత

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శిల్పారెడ్డి మండిపడ్డారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు ఏమయ్యాయి? మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్‌ రైల్లోనే మహిళలపై దాడులు జరిగితే, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో రక్షణ ఎలా ఉంటుంది? మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయా? వాటి ప్రభావం ఏమిటి? షీ టీమ్స్‌, శక్తి పోలీస్‌ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మహిళల భద్రత ఎన్నికల నాటికేనా? రాష్ట్ర మహిళా రక్షణ శాఖ ఎందుకు స్పందించలేదు? మహిళా భద్రత కోసం కేటాయించిన నిధుల సంగతేంటి? అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ప్రతి రైల్వే స్టేషన్‌, బస్సు స్టేషన్‌, మెట్రో స్టేషన్‌లలో ప్రత్యేక భద్రత విభాగాలను ఏర్పాటు చేయాలని శిల్పారెడ్డి  డిమాండ్‌ చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలి. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా అత్యాచార కేసులను 6 నెలల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. మహిళా భద్రత నిధిని పెంచి, దాన్ని సరైన విధంగా వినియోగించాలి. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. తెలంగాణలో మహిళలకు భద్రత కేవలం ప్రచారంలో మాత్రమే మిగిలిపోవద్దని, హామీలను అమలు చేసి, మహిళలకు నిజమైన రక్షణ కల్పించాలని శిల్పారెడ్డి హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com