కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దీపావళి విజేతగా నిలిచింది. థ్రిల్లర్ సినిమాల్లో ఓ సరికొత్త ప్రయత్నంగా “క” సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా రూపొందించి దర్శకులుగా తొలి చిత్రంతోనే తమ ప్రతిభ నిరూపించుకున్నారు సుజీత్, సందీప్. “క” సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారీ దర్శక సోదరులు.
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ
“క” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఇక్కడ విజయం సాధిస్తేనే మనుగడ అనుకున్నాం. అందుకే పట్టుదలగా సినిమా చేశాం. ప్రేక్షకులు మేము ఆశించిన ఫలితాన్ని ఇచ్చారు. ఈ దీపావళిని ఎంతో స్పెషల్ చేశారు. మా కుటుంబ సభ్యుల సంతోషానికి హద్దు లేదు. కిరణ్ మమ్మల్ని సోదరుల్లా చూశారు. ప్రొడక్షన్ నుంచి ప్రతి విషయం ఆయన దగ్గరుండి చూసుకున్నారు. మాదాకా ఏ ఒత్తిడి రానీయలేదు.
థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూస్తూ చివరలో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. మేము “క” కథ అనుకున్నప్పుడు ఇది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ ఈరోజు ప్రేక్షకులు కథకు చాలా కనెక్ట్ అవుతున్నారు. మాకు ఇండస్ట్రీలో ఏ పరిచయాలూ లేవూ. నేను యాడ్ ఏజెన్సీలో వర్క్ చేసేవాడిని. సందీప్ తన వర్క్ లో తను బిజీగా ఉండేవాడు. మేము బ్రదర్స్. కథలు రాయడాన్ని ఇష్టపడుతుంటాను. ప్రేక్షకులకు ఒక కొత్త కథను చెప్పాలి, యూనిక్ పాయింట్ తో మూవీ చేయాలని ఉండేది. “క” సినిమా కథను ఎవరికి చెప్పినా చాలా ఎగ్జైట్ అయ్యారు. అక్కడి నుంచే మాలో కాన్ఫిడెన్స్ మొదలైంది.
“క” సినిమా కథను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చెబితే మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుందని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన జీవితాల్లో ప్రైవసీ లేదు. సోషల్ మీడియాలో ప్రతి విషయం తెలుస్తోంది. కానీ ఒకప్పుడు ఉత్తరాల ద్వారా తప్ప మరొకరి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు లేదు. అందుకే హీరోకు పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ డిజైన్ చేశాం. కొన్ని ప్రత్యేకతలు ఉండేలా కృష్ణగిరి అనే ఊరిని తీసుకున్నాం. మధ్యాహ్నమే చీకటి పడటం అనేది తెలంగాణలో ఒక ఊరిలో జరుగుతుందని చదివాను. ఆ పాయింట్ ను కృష్ణగిరికి అడాప్ట్ చేశాం. ఈ బ్యాక్ డ్రాప్ లో మేము అనుకున్న అంశాలు మరింత ఎగ్జైటింగ్ గా మారాయి.