Monday, November 18, 2024

సోషల్‌మీడియాపై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన

ప్రభుత్వం, పార్టీపై వచ్చే అసత్య ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో సూచించిన నిపుణులు

ఏదైనా అంశాన్ని విస్తృత అధ్యయనం చేయడం ద్వారా సరైన సమాచారాన్ని సేకరించాలని, అలా సేకరించిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొ. కె. నాగేశ్వర్ రావు- పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొవడం ఎలా అన్న విషయాలను తెలుసుకోవడానికి మన్నే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లోని ప్రకాశ్‌హాల్‌లో గురువారం వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొ. కె. నాగేశ్వర్ రావు- ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాల గురించి వివరించారు.

సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ గురించి, స్పేర్ ఆన్, ఐఎన్‌సి క్లౌడ్ యాప్‌లను ఉపయోగించడం ద్వారా సోషల్ మీడియా వ్యవస్థను మరింత సులభతరం చేయడం ఎలా సాధ్యమో అరుణ్ (ఐటీ కన్సల్టెంట్) వివరించారు. ఏఐసిసి సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్‌ఫాం చైర్ పర్సన్ సుప్రియా శ్రీనేట్ సోషల్ మీడియాలో కాంగ్రెస్‌కు ఎదురైన ఇబ్బందులు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే మార్గాలపై మాట్లాడారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు స్పందించి ధీటుగా తిప్పికొట్టాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందరికీ తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.

అన్నీ రాజకీయ పార్టీలకు కీలకంగా సోషల్‌మీడియా: పిసిసి అధ్యక్షుడు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సోషల్ మీడియా అనేది అన్నీ రాజకీయ పార్టీలకు కీలకంగా మారిందని, మంచిగా, చెడుగా ప్రచారం చేయాలన్న ఇది ఒక సాధనంగా మారిపోయిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల ద్వారా 2014 లో బిజెపి అధికారంలోకి వచ్చిందని, గత పదేళ్లుగా బిజెపి అసత్య ప్రచారాలు చేస్తూ వస్తుందని ఆయన తెలిపారు. మన్నెసతీష్ కుమార్ (చైర్మన్ – సోషల్ మీడియా టిపిసిసి, టిజిటిఎస్) మాట్లాడుతూ సోషల్ మీడియా నిర్వహణలో కొత్త సాంకేతికతలను ఉపయోగించి, తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొవడానికి సన్నద్ధం కావాలని అందుకు అనుగుణంగా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సోషల్ మీడియా సమన్వయ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహకారంతో పార్టీ కోసం పని చేసిన సోషల్ మీడియా కార్యకర్తలను గుర్తింపును ఇస్తామని పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్తలకు స్మార్ట్ కార్డ్ జారీ చేయడం ద్వారా హెల్త్ ఇన్షూరెన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ పొందవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా అమిత్ రెడ్డి, చైర్మన్, తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, జగదీశ్వర్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జీ శేరిలింగంపల్లి , గిరిజ శెట్ట్కర్, సూర్య కిరణ్ పార్టీ సభ్యులు, తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular