పది రోజుల కిందట మృతి.. టెన్త్‌లో స్కూల్ టాపర్
కష్టపడి చదివింది. పది ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లోకాలకు వెళ్లింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. జిల్లాలోని బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలను ఉత్సాహంగా రాసింది. అయితే అంతలోనే ఏమైందో ఏమో అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17న మరనించింది. అయితే బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.